
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ పరిధిలోని అంజయ్యనగర్ లో తమ ఇంటిని కబ్జా చేసేందుకు వచ్చి, తమపై దాడి చేశారని బాధిత మహిళలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు గాయపడ్డారని చెప్పారు. బాధితుల కథనం ప్రకారం.. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వేనెంబర్ 136 జయ్య నగర్ లోని ఇంట్లో ముతోజు మధు కుటుంబంతో కలిసి 15 ఏండ్లుగా ఉంటున్నాడు. మధు ఇంటికి బల్దియా ఇంటి నెంబరుతోపాటు కరెంట్కనెక్షన్, మంజీరా వాటర్లైన్కనెక్షన్ ఉంది.
అయితే, తమ ఇంటి ఎదురుగా ఉంటే షేక్ రహీం, చాంద్ పాషా కొద్ది రోజులుగా తాము ఉంటున్న ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. ఇంతకుముందు ఒకసారి తమపై దాడి చేయగా కేసు పెట్టామని, ఆ వివాదం కోర్టులో నడుస్తోందని చెప్పారు. అయినా, సోమవారం సాయంత్రం షేక్ రహీం అతని భార్య, షేక్ చాంద్ పాషా అతని భార్య కలిసి తమ ఇంటిపై దాడి చేశారని మధు కుటుంబీకులైన నిర్మల, ఆమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాయదుర్గం పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి
మాట్లాడారు.