
న్యూఢిల్లీ: యెస్ బ్యాంక్‌లో 24.99 శాతం వాటాను జపాన్‌కు చెందిన సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్‌ఎంబీసీ)కు అమ్మడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అనుమతులు ఇచ్చింది. ఈ అనుమతి ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. కానీ ఎస్‌ఎంబీసీను యెస్ బ్యాంక్ ప్రమోటర్‌గా పరిగణించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ డీల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఈ ఏడాది మే 9న వచ్చింది.
యెస్ బ్యాంక్‌లోని తమ వాటాలో 13.19 శాతం వాటాను ఎస్‌బీఐ అమ్మనుంది. మరో 7 బ్యాంకులు కలిసి 6.81శాతం వాటాను సెకండరీ ట్రాన్సాక్షన్ ద్వారా అమ్ముతున్నాయి. ఆర్‌బీఐ అనుమతి బ్యాంకింగ్ చట్టం, ఫెమా, ఇతర నిబంధనలకు అనుగుణంగా ఉంది. కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతి, షేర్ కొనుగోలు ఒప్పందాల్లో పేర్కొన్న షరతుల అమలు తర్వాతే లావాదేవీ పూర్తవుతుంది. యెస్ బ్యాంక్ షేరు శుక్రవారం రూ.19.28 వద్ద ముగిసింది. గత 6 నెలల్లో షేరు 8శాతం వృద్ధి సాధించింది.