పాత నాణాలు, నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

పాత నాణాలు, నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: పాత నాణాలు మరియు నోట్ల క్రయవిక్రయాలపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. పాత నాణాలు లేదా నోట్లను అమ్మడం కాని లేదా కొంటామనే అసత్య ప్రచారాల బారిన పడకుండా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు, లోగోను ఉపయోగిస్తూ.. వివిధ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నాణేలు, పాత నోట్ల క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలలో ప్రజల నుంచి కమీషన్ వసూలు చేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. దాంతో ఆర్బీఐ స్పందిస్తూ.. ఆగస్టు 4న ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ఇటువంటి లావాదేవీలు నిర్వహించడం లేదని, పైగా కమీషన్లు అసలే తీసుకోబోమని తేల్చి చెప్పింది. అంతేకాకుండా అటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి ఏ సంస్థ లేదా వ్యక్తికి అధికారం లేదని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇటువంటి అసాంఘీక కార్యకలాపాలకు ఆర్బీఐ పేరును ఉపయోగిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

పాత నాణేలు మరియు నోట్ల లావాదేవీలతో లక్షల రూపాయల విలువైన వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ కీలక ప్రకటన చేసింది. ఈబే, క్వికర్, మరియు కాయిన్ బజార్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు పాత మరియు అరుదైన కరెన్సీని కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి ప్రజలకు అడ్డాలుగా మారాయి. ఏదేమైనా ఇటువంటి మోసాలకు వ్యతిరేకంగా ఎటువంటి కంప్లైంట్ రాలేదు. ఎందుకంటే ఈ సంస్థలన్నీ ఇ-కామర్స్ సంస్థలు. అందుకే వీటిలో లావాదేవీలు జరిపేటప్పుడు వాటి గురించి ఒకటికి పదిసార్లు తెలుసుకొని లావాదేవీలు చేసుకోవాలి. ఆ బాధ్యత అంతా వినయోగదారుడు లేదా కొనుగోలుదారుడి మీదే ఉంటుంది.