ఈఎంఐలు పెరుగుతయ్​..ఎకానమి గ్రోత్​ 7 శాతమే

 ఈఎంఐలు పెరుగుతయ్​..ఎకానమి గ్రోత్​ 7 శాతమే

ఆర్​బీఐ గవర్నర్​ దాస్​ వెల్లడి

వెలుగు బిజినెస్​ డెస్క్​: ఆర్​బీఐ వరసగా నాలుగోసారి బెంచ్​ మార్క్ (రెపో)​ రేట్లను 50 బేసిస్​ పాయింట్లు పెంచింది. దీంతో అప్పులు తీసుకున్న వారిపై వడ్డీ భారం పెరగనుంది. దేశంలో పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చేందుకు బెంచ్​ మార్క్​(రెపో) రేట్లను పెంచాలని ఆర్​బీఐ  నిర్ణయించింది. ఈ ఏడాది మే నెల నుంచి రెపో రేటును పెంచుతూ వస్తోంది. గవర్నర్​ శక్తికాంత దాస్​ నాయకత్వంలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ రేట్ల పెంపు నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించారు. తాజా పెంపుదలతో రెపో రేటు 5.9 శాతానికి చేరింది.

ఏప్రిల్​ 2019 నుంచి చూస్తే మన దేశంలో ఇదే అత్యధికం. ఎంపీసీలో ఆరుగురు మెంబర్లుంటే, అయిదుగురు మెంబర్లు రేట్ల పెంపుదలకు అనుకూలంగా ఓట్​ చేశారు. కమోడిటీస్​సహా వివిధ వస్తువుల రేట్లు చుక్కలంటుతుండటంతో వాటిని కిందికి దింపే ప్రయత్నంలో భాగంగానే రెపో రేటును ఆర్​బీఐ పెంచాల్సి వస్తోంది. ఎకానమి గ్రోత్​కి ఇబ్బంది కలగకుండానే ధరల పెరుగుదలను అదుపులోకి తేవాలనేది ఆర్​బీఐ ఆలోచన. జియో పొలిటికల్​ టెన్షన్లు, గ్లోబల్​ ఫైనాన్షియల్​ మార్కెట్​ సెంటిమెంట్ల నేపథ్యంలో ఇన్​ఫ్లేషన్ మన ఎకానమికి ఇంకా  కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ వెల్లడించారు.

ఈఎంఐల భారం పెరగనుంది...

రెపో రేటును 50 బేసిస్​ పాయింట్లు పెంచిన నేపథ్యంలో లోన్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. రెపో రేటుకి నేరుగా లింక్​ అయిన అప్పులపై ఈ పెంపుదల వెంటనే అమలులోకి వస్తుంది. దీంతో లోన్లు తీసుకున్న వారికి మరి కొంత బరువు మోయడం తప్పనిసరవుతుంది. ముఖ్యంగా హౌసింగ్​ లోన్ల ఈఎంఐలపై ఈ ఎఫెక్ట్​ ఎక్కువగా కనబడుతుంది. పండగ సీజన్​లో కొత్తగా ఇండ్లు కొనుక్కోవాలనుకునే వారు ఆ ఆలోచనను కొంత కాలం వాయిదా వేసుకునే ఛాన్స్​ ఉందని రియల్​ ఎస్టేట్​ నిపుణులు చెబుతున్నారు. ఎఫర్డబుల్​ హౌసింగ్​ (రూ. 40–50 లక్షల) సెగ్మెంట్​పై వడ్డీ రేట్ల పెంపుదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

గ్రోత్​ రేటు అంచనా తగ్గింది..

గ్లోబల్​పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మన ఎకానమి గ్రోత్​ రేటు అంచనాలను కూడా ఆర్​బీఐ సవరించింది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో గ్రోత్​ 7 శాతం దాకా ఉండొచ్చని తాజా అంచనాలను విడుదల చేసింది. అంతకు ముందు ఈ గ్రోత్​ రేటు 7.2 శాతంగా అంచనా వేశారు. 2022–23 ఫైనాన్షియల్​ ఇయర్లో రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​ అంచనాలను మాత్రం ఆర్​బీఐ మార్చలేదు. ఇది  6.7 శాతంగా ఉంటుందని గతంలోనే అంచనా వేశారు. 
రెపో రేట్ల పెంపు ఎఫెక్ట్​తో కార్పొరేట్లు, ఇండివిడ్యువల్స్​ తాము తీసుకునే అప్పులపై ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. కార్పొరేట్లు తమ కేపెక్స్​ ప్లాన్స్​విషయంలో మరింత ఆచితూచి వ్యవహరించే ఛాన్స్​ ఉంటుంది. -అను అగర్వాల్​, కార్పొరేట్​ బ్యాంకింగ్​ హెడ్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్