ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. రూ.2వేల నోటు మార్పిడికి గడువు పొడిగింపు

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. రూ.2వేల నోటు మార్పిడికి గడువు పొడిగింపు

ఈ ఏడాది మే19న రూ.2వేల నోటును రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అనంతరం ఆ నోట్లు కలిగిఉన్న వారు వాటిని మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువిచ్చింది. ఆ గడువు నేటి(శనివారం)తో ముగియనుండగా.. దానిని పొడిగిస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే, మరో వారం రోజుల పాటు రూ.2వేల నోట్లు మార్పిడికి వెసులుబాటు కల్పించిందన్నమాట.

ఆర్‌బీఐ నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 96 శాతం రూ. 2వేల నోట్లు తిరిగి వచ్చినట్లు స్పష్టమవుతోంది. వీటిలో చాలావరకు నోట్లు బ్యాంకుల ద్వారానే అందాయి. దీని ప్రకారం చూస్తే మిగిలిన నోట్లు వసూలు చేయడానికి మరో అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇంకా ఎవరైనా రూ. 2వేల నోట్లు కలిగిఉన్నట్లయితే మార్పిడి చేసుకోగలరని మనవి. గడువు ముగిశాక ఆ నోట్లకు ఎలాంటి వాల్యూ ఉండదు. నిరుపయోగంగా మారతాయి. మీ ఎంత బ్రతిమలాడినా బ్యాంక్ సిబ్బంది మీ విజ్ఞప్తిని పట్టించుకోరు.

  • ఒక వ్యక్తి ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో రోజుకు గరిష్ఠంగా రూ. 20వేల వరకు రూ. 2వేల నోట్లను డిపాజిట్‌ చేసుకోనేందుకు లేదా మార్పిడికి అనుమతించారు.
  • జన్‌ధన్‌ యోజన బ్యాంకు ఖాతాల్లో కూడా రూ. 2వేల నోట్లు డిపాజిట్‌ చేయవచ్చు.