ఆర్​బీఐ కరోనా సాయం.. హెల్త్‌‌ సెక్టార్‌‌‌‌కు స్పెషల్‌‌ లోన్లు

ఆర్​బీఐ కరోనా సాయం.. హెల్త్‌‌ సెక్టార్‌‌‌‌కు స్పెషల్‌‌ లోన్లు
  • ఆర్థిక వ్యవస్థపై వైరస్​ ప్రభావం తగ్గించేందుకు అనేక చర్యలు ప్రకటించిన శక్తికాంత దాస్​
  • బ్యాంకులకు రూ. 50  వేల కోట్ల లిక్విడిటీ సపోర్ట్‌‌
  • రూ. 35 వేల కోట్ల విలువైన బాండ్ల కొనుగోళ్లు

ముంబై: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తుండటంతో పరిస్థితులు చక్కబెట్టడానికి రిజర్వ్ బ్యాంకు మళ్లీ రంగంలోకి దిగింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న కొంత మంది వ్యక్తులు, చిన్న వ్యాపారుల కోసం రిజర్వ్ బ్యాంకు బుధవారం కొత్త రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించింది. అంతేకాదు, వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీలకు, హాస్పిటళ్లకు, కోవిడ్ సంబంధ హెల్త్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌కు అప్పులు ఇవ్వడంలో ముందుండేలా బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. 2020లో తమ లోన్లను రిస్ట్రక్చర్ చేసుకోని వ్యక్తులు, చిన్న వ్యాపారులు రెండేళ్లపాటు ఇప్పుడు రిస్ట్రక్చర్ చేసుకునే వెసులుబాటును ఆర్‌‌‌‌బీఐ ప్రకటించింది. అయితే మార్చి 2021 నాటికి ఈ అప్పులు స్టాండర్డ్ అకౌంట్లుగా ఉండాలని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. రూ. 25 కోట్ల లోపు అప్పులకు మాత్రమే ఈ రిలీఫ్ ప్యాకేజ్ వర్తిస్తుంది. బ్యాంకులకు రూ. 50 వేల కోట్ల లిక్విడిటీ సపోర్ట్‌‌ను అందించనున్నట్లు కూడా దాస్ వెల్లడించారు. వ్యాక్సిన్ మాన్యుఫాక్చరర్లు, ఇంపోర్టర్లు, వ్యాక్సిన్ సప్లయర్లు, మెడికల్ డివైజ్‌‌ల వ్యాపారులకు ఈ డబ్బును బ్యాంకులు అప్పులుగా ఇస్తాయని దాస్ పేర్కొన్నారు. మూడేళ్ల టెనూర్‌‌‌‌తో ఈ అప్పులు ఇస్తారని, రెపో రేటుకే అందుబాటులో ఉంటాయని తెలిపారు. మార్చి 31, 2022 దాకా ఈ రుణ సదుపాయం ఉపయోగించుకోవచ్చని కూడా పేర్కొన్నారు. ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడనున్నారని మంగళవారం రాత్రే ప్రకటన వచ్చింది. 

ఇన్‌‌ఫ్లేషన్ టార్గెట్స్‌‌ మార్చాల్సిన అవసరం లేదు..
కరోనా ఫస్ట్ వేవ్ ప్రభావం నుంచి ఎకానమీ కోలుకుంటున్న టైములో రెండో వేవ్ వచ్చి పెద్ద దెబ్బే కొట్టింది. దీంతో కొన్ని సిటీల వారీగాను, కొన్ని చోట్ల రాష్ట్రమంతటా కూడా రెస్ట్రిక్షన్లు అమలు చేస్తున్నారు. ఫలితంగా కొన్ని వ్యాపారాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశంలో రోజుకి 3 లక్షలకు పైగా కరోనా కేసులు రికార్డవుతున్నాయి. గత కొన్ని వారాలుగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో ఆర్‌‌‌‌బీఐ మీటింగ్‌‌లు నిర్వహిస్తోంది. ఆర్థిక పరిస్థితులను, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లపై కరోనా ప్రభావం గురించి చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా, అప్పుల మంజూరీ ఎలా ఉందనే విషయాన్నీ తెలుసుకుంటోంది. రిటైలు, చిన్న బారోవర్ల కోసం మరోసారి మూడు నెలల మారటోరియం ప్రకటించాలని ఈ మీటింగుల్లో బ్యాంకర్లు ఆర్‌‌‌‌బీఐని కోరినట్లు సమాచారం. ఆర్‌‌‌‌బీఐ జరిపే బాండ్స్ కొనుగోలు క్యాలెండర్‌‌‌‌ను కూడా గవర్నర్ దాస్ వెల్లడించారు.  గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్ (జీ–శాప్) కింద రూ. 35 వేల కోట్ల విలువైన బాండ్స్‌‌ను మే 20 నాడు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. 

కేవైసీ గడువు డిసెంబర్ వరకు పొడిగింపు
ఇప్పటి వరకు కేవైసీ (నో యువర్ కస్టమర్) డాక్యుమెంట్స్ అందజేయని కస్టమర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఆర్‌‌బీఐ బ్యాంకులకు బుధవారం స్పష్టం చేసింది.  కేవైసీ పూర్తి చేయడానికి ఈ ఏడాది డిసెంబరు వరకు గడువు ఇవ్వాలని ఆదేశించింది. యాజమాన్య సంస్థలు, ఆథరైజ్డ్ సిగ్నీచరీస్, చట్టపరమైన సంస్థల యజమానులు వంటి కొత్త వర్గాల కస్టమర్ల కోసం వీడియో కేవైసీ లేదా వీ–సిప్ (వీడియో-ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్) ద్వారా కేవైసీ పూర్తి చేయడానికి అవకాశం ఇవ్వాలని సూచించింది. ‘‘దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరోనా రిస్ట్రిక్షన్లు అమలవుతున్నందున, కేవైసీని పూర్తి చేయడానికి ఈ ఏడాది డిసెంబరు వరకు గడువు పెంచుతున్నాం. అప్పటి వరకు బ్యాంకులు నాన్–కేవైసీ కస్టమర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోవు”అని ఆర్‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

ఇండస్ట్రిలిస్టులు హ్యాపీ 
ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటర్ చేస్తూ, తగిన చర్యలను తీసుకోనున్నట్లు ఆర్‌‌‌‌బీఐ స్పష్టం చేసింది. బుధవారం ఆర్‌‌‌‌బీఐ తీసుకున్న చర్యలను వ్యాపార, పారిశ్రామిక అసోసియేషన్స్ స్వాగతించాయి. జీవితాలను, బతుకుతెరువును కాపాడేలా ఈ చర్యలున్నాయని సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కోటక్ అన్నారు. బ్యాంకుల అసెట్ క్వాలిటీ మరోసారి దెబ్బతినకుండా సరయిన టైములో తీసుకున్న నిర్ణయంగా మెచ్చుకున్నారు. ఎకనమిక్ రికవరీ అన్ని చోట్లా కనబడుతోందని, కాకపోతే ఒక్కో దేశంలో ఒక్కోలా, ఒక్కో రంగంలో ఒకోలా ఉందని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. 2020–21లో ఇండియాలో ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ రికార్డు లెవెల్స్‌‌ చేరింది. దీంతో ఫుడ్ సెక్యూరిటీ ఏర్పడటమే కాకుండా, ఇతర రంగాలకూ సపోర్ట్ దొరికింది. ఈ కారణంగానే, రూరల్ డిమాండ్, రూరల్ ఎంప్లాయ్‌‌మెంట్‌‌,  అగ్రికల్చర్ ఇన్‌‌పుట్స్‌‌, సంబంధిత సప్లయ్స్‌‌కు మద్దతు లభించింది. కాకపోతే, కాంటాక్టు తప్పనిసరయిన సర్వీస్‌‌ల విషయంలోనే  తాత్కాలికంగా కొంత దెబ్బ తగులుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయిలో ఉంటాయని ఐఎండీ అంచనాల నేపథ్యంలో ఆహార ఉత్పత్తుల ధరలు పెరగకుండా చూడొచ్చని దాస్ భావిస్తున్నారు. రూ. 50 వేల కోట్ల లిక్విడిటీ ఫెసిలిటీ స్కీము కింద బ్యాంకులు కోవిడ్ లోన్ బుక్ క్రియేట్ చేస్తాయని శక్తికాంత దాస్ చెప్పారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కూడా రూ. 10 వేల కోట్ల లిక్విడిటీ అందిస్తున్నట్లు చెబుతూ, దీనిని ఆ బ్యాంకులు రూ. 10 లక్షల లోపు అప్పులు తీసుకున్న వారికి కొత్తగా అప్పుల కింద ఇస్తాయని పేర్కొన్నారు. ఈ ఫెసిలిటీ అక్టోబర్ 31 దాకా అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీల విషయంలోనూ కొన్ని మినహాయింపులను ఆర్‌‌‌‌బీఐ ప్రకటించింది. సెకెండ్‌‌ వేవ్‌‌ను విజయవంతంగా ఎదుర్కోగలుగుతామని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు.