
- రూ. 2.11 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లింపు
ముంబై: ఆర్బీఐ 2023–-24 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రికార్డుస్థాయిలో రూ. 2.11 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లింపును బుధవారం ఆమోదించింది. ఇంత డబ్బు రావడం వల్ల కేంద్రానికి ద్రవ్య లోటు తగ్గుతుంది. 2022-–23 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ రూ. 87,416 కోట్ల డివిడెండ్ ఇచ్చింది. అయితే 2018–-19లో రూ.1.76 లక్షల కోట్లు చెల్లించింది. 2023-–24 అకౌంటింగ్ సంవత్సరానికి రూ. 2,10,874 కోట్లను మిగులుగా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు లేదా వ్యయం రాబడి మధ్య అంతరాన్ని రూ. 17.34 లక్షల కోట్లకు (జీడీపీలో 5.1 శాతం) తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-–25 బడ్జెట్‌లో ప్రభుత్వం.. ఆర్బీఐ, ఇతర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని రూ. 1.02 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఆర్బీఐ బోర్డు ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితిని కూడా సమీక్షించింది. 2023–-24లో రిజర్వ్ బ్యాంక్ పని తీరును బోర్డు చర్చించింది.