- జీడీపీ వృద్ధి అంచనా ఏడు శాతం
- ప్రకటించిన ఆర్బీఐ
ముంబై : ఎనలిస్టులు అంచనా వేసినట్టుగా ఆర్బీఐ ఈసారి కూడా వడ్డీరేట్లను మార్చలేదు. బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను వరుసగా ఏడవసారి 6.5 శాతం వద్దే కొనసాగించింది. ఫలితంగా బ్యాంకు లోన్ల ఈఎంఐలు మరికొంత కాలం స్థిరంగా ఉండే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంక్ గత ఫిబ్రవరి నుంచి వడ్డీ రేట్లను మార్చలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలను వరుసగా 7 శాతం, 4.5 శాతం వద్ద ఉంచింది. పాలసీ రెపో రేటును యథాతథంగా ఉంచడానికి ఆరుగురు మెంబర్లు ఉన్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) లో ఐదుగురు ఓకే చెప్పారు.
వృద్ధికి మద్దతునిస్తూ ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా చూసేందుకు ద్రవ్య ప్రవాహం ఉపసంహరణపై దృష్టి సారిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. ఏడు శాతం లేదా అంతకంటే ఎక్కువ జీడీపీ వృద్ధి రేటు వరుసగా నాలుగో సంవత్సరం అవుతుంది. 2023–-24లో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
ఎంపీసీ ముఖ్యాంశాలు:
రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం వరకు ఉండొచ్చు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 5.4 శాతం కంటే ఇది తక్కువ. దీనిని నాలుగు శాతానికి తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ ప్రకటించింది.
బలమైన గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ, సేవల రంగం బలంగా ఉండటం వల్ల ప్రైవేట్ వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సావరిన్ గ్రీన్ బాండ్ల వ్యాపారాన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో అనుమతి ఇస్తారు. గవర్నమెంటు సెక్యూరిటీల్లో రిటైల్ భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తారు. యూపీఐ ద్వారా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లను అనుమతిస్తారు.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వాలెట్లను అందించడానికి నాన్-బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లను అనుమతిస్తారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా నికర ఇన్ఫ్లోల విలువ 2023–-24లో 41.6 బిలియన్ డాలర్లు ఉంది. భారత్ ప్రపంచంలోనే అత్యధిక విదేశీ చెల్లింపులను (రెమిటెన్స్లు) స్వీకరించే దేశంగా కొనసాగుతోంది
2024 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన కరెన్సీలలో రూపాయి అత్యంత స్థిరంగా ఉంటుంది. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) తదుపరి సమావేశాన్ని జూన్లో నిర్వహిస్తారు.