93 శాతం 2 వేల నోట్లు వెనక్కి

93 శాతం 2 వేల నోట్లు వెనక్కి

ముంబై : చెలామణీలోని 93 శాతం రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్​బీఐ డేటా వెల్లడిస్తోంది. ఆగస్టు 31 నాటికి రూ. 3.32 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు బ్యాంకుల దగ్గరకు చేరినట్లు ఆర్​బీఐ  పేర్కొంది. ఇంకా చెలామణీలో మిగిలిన రూ. 2 వేల నోట్ల విలువ రూ. 0.24 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపింది. బ్యాంకుల నుంచి వచ్చిన డేటా ప్రకారం వెనక్కి వచ్చిన  రూ. 2 వేల నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనూ, మిగిలిన 13 శాతం ఇతర కరెన్సీ నోట్ల  ఎక్స్చేంజ్​ కింద వచ్చినట్లు వివరించింది. 

ఈ ఏడాది మే 19 నాడు రూ. 2 వేల నోట్లను విత్​డ్రా చేస్తున్నట్లు ఆర్​బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 2023 నాటికి దేశంలో రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చలామణీలో ఉండేవి. రూ. 2 వేల నోట్లను వెనక్కి ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు టైమ్‌ ఉంది.