ఎలక్షన్ టైమ్ లో లీడర్ల పరేషాన్..2వేల నోట్లు మార్పిడికి చిక్కులు

ఎలక్షన్ టైమ్ లో లీడర్ల పరేషాన్..2వేల నోట్లు మార్పిడికి చిక్కులు

ఎలక్షన్ టైంలో లీడర్లు ఫండ్స్ రెడీ చేసుకోవడం మామూలే. అయితే.. ఈసారి చాలామంది లీడర్లకు కొత్త చిక్కే వచ్చిపడిందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఈమధ్య 2 వేల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకోవడం వారికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతానికి నోట్లు చెల్లుబాటు అవుతున్నా.. సెప్టెంబర్ లోపే మార్చుకోవాల్సి ఉండడమే వారికి బాధవుతుందని పలువురు నేతలు చెబుతున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే చాలామంది లీడర్లు డబ్బు రెడీ చేసిపెట్టుకుంటున్నారు. ఇంకా ముందే రెడీ అయిన లీడర్ల దగ్గర 2 వేల నోట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈసారి ఖర్చు భారీగానే ఉంటుంది. కాబట్టి.. ఈజీగా పంచడానికి వీలుగా 2 వేల నోట్లు రెడీ చేసుకున్నారు. సడెన్ గా విత్ డ్రా ప్రకటన రాగానే పలువురు లీడర్లు షాక్ తిన్నట్లు తెలుస్తోంది. నోట్లు మార్చకుందామనుకున్నా 20 వేల లిమిట్ ఉండడంతో అంత ఈజీ కాదంటున్నారు. మనుషుల్ని పెట్టి మార్చుకుందామన్నా దానికీ ఎదురు ఖర్చు తప్పదని పరేషన్ అవుతున్నారు.

లక్షల్లో ఉండే నోట్ల అయితే సెప్టెంబర్ లోపు ఎలాగోలా మార్చుకోవచ్చు. కోట్లు, వందల కోట్లలో ఉన్నవారికి మాత్రం టెన్షన్ తప్పట్లేదంటున్నారు. కొంతమంది ఇండస్ట్రీల వారి ద్వారా మార్చుకోవడానికి ట్రై చేసినట్లు చెబుతున్నారు. అయితే.. వారి దగ్గరా పెద్ద మొత్తంలోనే 2 వేల నోట్లు ఉండడంతో మా పరిస్థితీ అదేనని మొత్తుకుంటున్నారట. దీంతో 2 వేల నోట్లు పంచుదామనున్న నేతలకు కొత్త బుగులు పట్టుకుంది. 

ఒక రేంజ్ లీడర్లు పరిస్థితి ఇట్లా ఉంటే.. ఒక కీలక పార్టీ పరిస్థితి అంతకు మించి ఉందని  ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. బైపోల్స్ లో గెలుపు కోసం వందలకోట్లు కుమ్మరించిన ఆ పార్టీ ముఖ్య నేతలు ఈసారి ముందు జాగ్రత్తగా జిల్లాల వారీగా వారి సన్నిహితుల దగ్గర భారీ స్థాయిలోనే 2 వేల నోట్ల డంప్ లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లో పరిస్థితి బాగలేకపోయినా పైసల డంప్ లున్నాయనే ధైర్యంతోనే మీటింగ్ లు, కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నామని కొందరు లీడర్లు చెబుతున్నారు. ఇప్పుడు 2వేల నోట్లు వెనక్కి తీసుకోవడంతో ఇంత పెద్ద మొత్తాన్ని ఏం చేయాలన్న పరేషన్ లో పడ్డారంట.
 
కొంతమంది లీడర్లు వచ్చిన కాడికి మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరికొందరు పెద్ద మొత్తంలో కమీషన్లు ఇస్తామంటూ బ్రోకర్లతో మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద 2 వేల నోట్ల విత్ డ్రా దెబ్బకు ఈసారి ఎలక్షన్ లో పైసలు పంపిణీపై కొంత ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు కొందరు లీడర్లు.