
న్యూఢిల్లీ: ఈసారి ఆర్బీఐ ఎంపీసీ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని ఎకానమిస్టులు చెబుతున్నారు. ఇదే రేట్లను కొనసాగించే ఛాన్స్ ఎక్కువని వారు పేర్కొంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్ త్వరలో జరగనుంది. ఏప్రిల్ నెల సమావేశంలో రేట్లను 6.5 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయించింది. పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ను కట్టడి చేసేందుకు అంతకు ముందు కొంతకాలంగా వడ్డీ రేట్లను ఆర్బీఐ ఎంపీసీ పెంచుతూ వచ్చింది. రాబోయే ఎంపీసీ మీటింగ్ రెండు కీలకమైన అంశాలపై ఫోకస్ పెడుతుందని ఎక్యూయైట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకానమిస్ట్ సుమన్ చౌదరి చెప్పారు. రిటెయిల్ ఇన్ఫ్లేషన్లో చెప్పుకోదగ్గ తగ్గుదల, క్యూ4లో జీడీపీ మెరుగ్గా ఉండటం...అనే రెండింటిపైనా ఫోకస్ ఉంటుందని పేర్కొన్నారు.
వరుసగా రెండోసారి ఏప్రిల్2023 లోనూ ఆర్బీఐ టార్గెట్ కంటే తక్కువగా అంటే 4.70 శాతంగా రిటెయిల్ ఇన్ఫ్లేషన్ రికార్డయింది. ఇది 18 నెలల కనిష్టం కూడా. మరోవైపు హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్34 నెలల కనిష్ట లెవెల్‌కి చేరింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గడం, కమొడిటీ ఖర్చులు తక్కువవడం, ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం వంటి కారణాల వల్లే ఇన్ఫ్లేషన్ తగ్గిందని చౌదరి వివరించారు. కన్జూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్(సీపీఐ) తగ్గుదల ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంటిన్యూ అవుతుందని అంచనా వేస్తున్నామని, సర్వీసెస్‌లో గ్రోత్ మొమెంటమ్ పటిష్టంగా ఉండటం వల్ల కోర్ఇన్ఫ్లేషన్లో కొంత ఇబ్బంది ఉండొచ్చని అన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సీపీఐ 5.3 శాతంగా రికార్డవచ్చని, ఇంతకు ముందు ఏడాది ఇది 6.6 శాతంగా ఉందని పేర్కొన్నారు. క్యూ4 జీడీపీ మార్కెట్ అంచనాలను మించిందని, కానీ ఆ క్వార్టర్లో ప్రైవేట్ కన్జంప్షన్ 2.8 శాతానికే పరిమితమైందని చౌదరి చెప్పారు.
పైన పేర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ ఎంపీసీ ఈసారి వడ్డీ రేట్లను ఇప్పుడున్న చోటే కొనసాగించే అవకాశాలే ఎక్కువని పేర్కొన్నారు. వడ్డీ రేట్లలో కోత వెంటనే ఉండకపోవచ్చని మరో ఎకానమిస్ట్ చర్చిల్ భట్ చెప్పారు. పాత రేట్లనే కొనసాగిస్తారనే అంచనా వేస్తున్నట్లు కోటక్ మహీంద్రా ఈవీపీ చర్చిల్ భట్ పేర్కొన్నారు. వడ్డీ రేట్ల పెంపుదల ఎఫెక్ట్ ఎకానమీలో రిఫ్లెక్ట్ కావడం వల్లే ఇన్ఫ్లేషన్ దిగొచ్చిందని, రేట్లను ఇప్పుడు పెంచాల్సిన అవసరమైతే లేదని ఇందిరా గాంధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఎమెరిటస్ ప్రొఫెసర్ ఆశిమా గోయెల్ అన్నారు. ఇటీవల జరిగిన ఎంపీసీ సమావేశాలలో ఆశిమా గోయెల్‌తోపాటు, ఐఐఎం ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ కూడా రెపో రేటు పెంపుదలను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో 6 నుంచి 8 తేదీల దాకా ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ జరగనుంది.