ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించడంతో... హైదరాబాద్‌లో ఆర్సీబీ ఫ్యాన్స్ ఉత్సాహం అంబరాన్ని తాకింది. వరుసగా రెండో ఏడాది కూడా ఆర్సీబీ కప్ కొట్టడం... ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించడంతో అభిమానుల జోష్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది.
మ్యాచ్ ముగిసిన వెంటనే అర్ధరాత్రి వేళ నగరంలోని సచివాలయం, ట్యాంక్‌బండ్ పరిసరాల్లోకి భారీగా క్రికెట్ అభిమానులు, ఆర్సీబీ ఫ్యాన్స్ దూసుకొచ్చారు. రోడ్లపైనే బాణాసంచా కాలుస్తూ, కేరింతలు కొడుతూ, డాన్సులతో హంగామా సృష్టించారు. ఈ సాలా కప్ నమ్దే అంటూ ఆర్సీబీ స్లోగన్స్‌తో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.
అయితే, వందలాది మంది అభిమానులు ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో సచివాలయం వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపై రచ్చ చేస్తున్న అభిమానులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
పోలీసులు హెచ్చరించినా వినకుండా... కొందరు అభిమానులు రోడ్లపైనే పటాకులు కాలుస్తూ హంగామా కొనసాగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు లాఠీలు ఝుళిపించాల్సి వచ్చింది. లాఠీఛార్జ్ చేసి అభిమానులను అక్కడ నుంచి చెదరగొట్టారు. ఏదేమైనా... ఆర్సీబీ రెండోసారి టైటిల్ గెలవడంతో హైదరాబాద్‌లోని రాయల్ చాలెంజర్స్ ఫ్యాన్స్ సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతున్నాయి.
