IPL 2026: పటిదార్ ఫటా ఫట్ ఇన్నింగ్స్.. ఐపీఎల్ చరిత్రలో RCB నయా రికార్డ్

IPL 2026: పటిదార్ ఫటా ఫట్ ఇన్నింగ్స్.. ఐపీఎల్ చరిత్రలో RCB నయా రికార్డ్

ధర్మశాల: ఐపీఎల్ 19లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం (మే 26) ధర్మశాలలోని హెచ్‌పీసీఎ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచులో ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. తద్వారా ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఆర్సీబీ నయా రికార్డ్ నెలకొల్పింది. గతంలో ఈ రికార్డ్ గుజరాత్ టైటాన్స్ పేరిట ఉండేది. 2023లో క్వాలిఫయర్ 2లో గుజరాత్  233 పరుగులు చేసింది. 

తాజాగా గుజరాత్ రికార్డ్‎ను ఆర్సీబీ అదే జట్టుపై బ్రేక్ చేయడం విశేషం. దీంతో పాటు ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక బౌండరీలు బాదిన తొలి టీమ్‎గా కూడా ఆర్సీబీ రికార్డ్ సృష్టించింది. గతంలో ఈ రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2012లో  ఢిల్లీ క్యాపిటల్స్‎తో జరిగినసెమీ-ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 33 బౌండరీలు బాదింది. తాజాగా గుజరాత్‎పై 38 బౌండరీలు సాధించడం ద్వారా చెన్నై రికార్డ్‎ను ఆర్సీబీ చెరిపేసింది. 

పటిదార్ ఫటా ఫట్ ఇన్నింగ్స్:

ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1 మ్యాచులో బ్యాటింగ్‎లో ఆర్సీబీ దుమ్మురేపింది. ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (93) లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అంటూ ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేసిండు.  కోహ్లీ (43), పడిక్కల్ (30),  కృనాల్ పాండ్య (43) రాణించారు.