
లక్నో: ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగికంగా వాడుకున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో యశ్ దయాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ క్రమంలో తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై యశ్ దయాల్ ఎట్టకేలకు స్పందించాడు. సదరు యువతిపై పోలీసులకు రిటన్ కంప్లైంట్ ఇచ్చిన యశ్ దయాల్.. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరాడు. కంప్లైంట్లో యశ్ దయాల్ కీలక విషయాలు ప్రస్తావించాడు.
తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ తన ఫోన్, ల్యాప్ టాప్ దొంగలించిందని ఆరోపించాడు. 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ మహిళతో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఒకరితో ఒకరం మాట్లాడుకున్నామని పేర్కొన్నాడు. ఆసుపత్రికి వెళ్లాలని చెప్పి తన దగ్గర నుంచి లక్షల రూపాయలు అప్పుగా తీసుకుందని.. డబ్బు తిరిగి ఇస్తానని చెప్పి ఇప్పటికీ రిటన్ ఇవ్వలేదని తెలిపాడు.
షాపింగ్ కోసం ఆమె తన నుండి పదేపదే డబ్బు అప్పుగా తీసుకుందని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు యశ్ దయాల్. తనపై ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిసి.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. తనను మోసం చేసిన ఆ మహిళతో పాటు ఆమె కుటుంబంలోని అనేక మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని యశ్ దయాల్ పిటిషన్లో పేర్కొన్నాడు.
కాగా, ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ యష్ దయాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీలు ఇవ్వడం, మోసపూరితంగా లైంగిక సంబంధం పెట్టుకోవడంతో.. బీఎన్‌ఎస్ సెక్షన్ 69 ప్రకారం అతనిపై ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
►ALSO READ | ICC Latest Rankings: టాప్-10 లోకి టీమిండియా కెప్టెన్.. నెంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా బ్రూక్
గత ఐదేళ్లుగా యష్.. తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఓ మహిళ ఐజీఆర్‌ఎస్ (ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులకు పరిచయం చేయడంతో తాను యష్‌ను నమ్మానని సదరు మహిళ వెల్లడించింది. కొద్ది రోజుల తర్వాత మానసికంగా, శారీరకంగా వేధించడంతో పాటు డబ్బులు కూడా తీసుకున్నట్లు తెలిపింది. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, చాట్ రికార్డులు, స్క్రీన్ షాట్స్, కాల్ రికార్డింగ్‌లు, ఫొటోలను పోలీసులకు అందజేసింది.