RCB vs SRH: సిద్ధం కానీ చిన్నస్వామి స్టేడియం.. ఆర్సీబీ vs ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగేది డౌటే!

RCB vs SRH: సిద్ధం కానీ చిన్నస్వామి స్టేడియం.. ఆర్సీబీ vs ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగేది డౌటే!

RCB vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) 2026 సీజన్ కేవలం రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్‌కు వేదికైన ఎం. చిన్నస్వామి స్టేడియం ఇంకా సిద్ధం కాలేదని సమాచారం. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌కు కేవలం రెండే రోజుల సమయం మాత్రమే ఉన్నా, స్టేడియం ఇంకా 'నిర్మాణ ప్రాంతం'లా కనిపిస్తోంది.

మైదానం సిద్ధంగా ఉన్నప్పటికీ, స్టేడియం లోపల వడ్రంగులు, మేస్త్రీలు, కాంట్రాక్టర్లు ఇంకా పనులు చేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రౌండ్ ప్రవేశ ద్వారాల దగ్గర ప్లైవుడ్ షీట్లు, నిర్మాణ సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపిస్తున్నాయి. గతేడాది జూన్ 4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించడంతో, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఫ్యాన్ సెక్షన్లు, ఎగ్జిట్ పాయింట్ల వద్ద భారీగా మార్పులు చేపట్టింది. వాస్తవానికి ఈ పనులన్నీ మార్చి 15వ తేదీ నాటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం చేసిన మార్పుల వల్ల ఇంకా పనులు జరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా మేము నిద్ర కూడా పోలేదని  అక్కడ పని చేస్తున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

►ALSO READ | Team India: భారత్ హోమ్ మ్యాచ్ల షెడ్యూల్ రిలీజ్.. 9 వన్డేలు ఆడనున్న విరాట్, రోహిత్

బెంగళూరులో జరిగిన విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవార్థం, ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకలను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కానీ మే 31వ తేదీన జరిగే ఫైనల్ రోజున గ్రాండ్ క్లోజింగ్ సెర్మనీని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఒకవైపు నిమిషాల వ్యవధిలోనే టిక్కెట్లు అమ్ముడైపోగా, మరోవైపు స్టేడియం పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మార్చి 28వ తేదీన జరగబోయే మ్యాచ్ సమయానికి స్టేడియం పూర్తిగా ముస్తాబవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.