రెవెన్యూ డివిజన్ కోసం మళ్లా దీక్షలు

రెవెన్యూ డివిజన్ కోసం మళ్లా దీక్షలు

మెదక్, రామాయంపేట, వెలుగు: మెదక్‌‌‌‌ జిల్లాలోని రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం మళ్లీ పోరాటం మొదలైంది. గతంలో 189 రోజుల పాటు దీక్షలు చేసినా సర్కారు స్పందించకపోవడంతో ఈ సారి మరింత పకడ్బందీగా కార్యాచరణ అమలు చేయాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ఇందులోభాగంగా సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రభుత్వం హామీ వచ్చేంత వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.  

గతంలో నియోజకవర్గ కేంద్రం

రామాయంపేట గతంలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉండేది.  మాజీ ముఖ్యమంత్రి అంజయ్య  ఇక్కడి నుంచే  ఎమ్మెల్యేగా గెలుపొందడంతో రామాయంపేటకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించింది.  2009లో జరిగిన  నియోజకవర్గాల పునర్‌‌‌‌‌‌‌‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌‌‌‌ రద్దయింది.  2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాలతోపాటు, కొత్త రెవెన్యూ డివిజన్‌‌‌‌లను కూడా ఏర్పాటు చేసింది.  

ఈ క్రమంలో మండల కేంద్రంగా ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌‌‌‌ చేయాలనే డిమాండ్‌‌‌‌ మొదలైంది.  రామాయంపేట మున్సిపాలిటీ, రూరల్​ మండలం,  నిజాంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి మండలాలను డివిజన్ చేయాలని,  ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ 44 ఉండడంతో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు.

ఎలక్షన్ ఇయర్ కావడంతో..

రెవెన్యూ డివిజన్​ సాధన కోసం వివిధ పార్టీలు, కుల, యువజన, వ్యాపార తదితర సంఘాలన్నీ ఏకమై పెద్ద ఎత్తున పోరాటం చేశాయి.  2017, 2018లో ఎమ్మెల్యే, మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి  వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు అఖిల పక్ష నాయకులు, కుల సంఘాలు, స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో 183 రోజుల పాటు రిలే దీక్షలు చేశారు.  ఈ క్రమంలో మంత్రి హరీశ్‌‌‌‌ రావు పరిశీలిద్దామని చెప్పినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

పైగా అదే సమయంలో ప్రభుత్వం కొత్తగా పలు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినా.. రామాయంపేటకు అవకాశం ఇవ్వలేదు.  ప్రస్తుతం ఎలక్షన్​ఇయర్​కావడంతో మరో సారి ఉద్యమాన్ని  ప్రారంభించారు. మొన్నటి డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జేఏసీ ఏర్పాటు చేసి..   ర్యాలీలు, ఇంటింటికి పాంప్లెంట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు.  ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి,  మంత్రి హరీశ్‌‌‌‌రావులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అయినా స్పందన రాకపోవడంతో రిలే నిరాహార దీక్షలు షురూ చేశారు. 

మంత్రి హామీని నిలబెట్టుకోవాలి

రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని గతంలో 183 రోజులు రిలే దీక్షలు చేసినం. అప్పట్లో మంత్రి హరీశ్‌‌‌‌ రావు జేఏసీ లీడర్లను,  ఇంటికి పిలుచుకుని పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. కానీ,  నేటికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.  డివిజన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తం. 

- పోచమ్మల అశ్విని, జేఏసీ లీడర్ 

అభివృద్ధి కుంటుపడింది

రామాయంపేట నియోజకవర్గం రద్దయినప్పటి నుంచి ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడింది. కనీసం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయితేనన్న కొంత మేర అభివృద్ధి చెందుతుంది. అందుకోసమే జేఏసీ ఆధ్వర్యంలో డివిజన్ ఏర్పాటు  కోసం ఉద్యమం చేస్తున్నం. 

- సుంకోజి దామోదర్​, జేఏసీ లీడర్