తెలంగాణలో పొత్తుకు రెడీ

తెలంగాణలో పొత్తుకు రెడీ
  •      కాంగ్రెస్​, బీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నయ్‌: కేఏ పాల్

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్  కేఏ పాల్  తెలిపారు. ఆ రెండు పార్టీలు తమతో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నాయని, త్వరలో తమ నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్  బషీర్ బాగ్  ప్రెస్ క్లబ్ లో సినీ నటుడు బాబు మోహన్​తో కలిసి పాల్  మాట్లాడారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నానని, ఇటీవలే పార్టీలో చేరిన బాబు మోహన్  వరంగల్  నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వంతో అధికార వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ లక్షల కోట్లు అప్పు చేస్తుంటే, ఏపీ సీఎం వైఎస్  జగన్ ఏడాదికి లక్షల కోట్లు అప్పు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో తాము ఒంటరిగా అన్ని స్థానాలలో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బాబు మోహన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను బీఆర్ఎస్, బీజేపీ పక్కన పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇస్తానని బీజేపీ తన సేవలు వాడుకుందని, 12 రాష్ట్రాల్లో తనతో ప్రచారం చేయించుకొని లబ్ధి పొంది, చివరకు పక్కన పెట్టిందని ఆరోపించారు. 

కనీసం ఈ లోక్ సభ ఎన్నికల్లో అయినా టికెట్  కేటాయిస్తారని ఆశించినా చివరకు మోసం చేశారని చెప్పారు. తెలంగాణలో బీజేపీయేతర శక్తులను ఐక్యం చేసి ప్రజాశాంతి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఏపీలో ప్రజా శాంతి పార్టీ పోటీచేసే అన్ని స్థానాలలో తాను ఎన్నికల ప్రచారం చేసి పార్టీ గెలుపుకు ప్రయత్నిస్తానన్నారు.