జమ్మూకశ్మీర్‌లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధం

జమ్మూకశ్మీర్‌లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధం

జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. సుప్రీం కోర్టులో 370 రద్దును  సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా..   జమ్మూ కాశ్మీర్‌లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి నిర్దిష్ట కాలపరిమితిని ఇవ్వలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.  అయితే కేంద్ర పాలిత హోదా తాత్కాలికమేనని స్పష్టం చేసింది.  రాష్ట్ర  హోదా పునరుద్దిరించేందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది. 

జమ్మూ కశ్మీర్ లో  2018 నుంచి 2023తో పోలిస్తే ఉగ్రవాద కేసులు 45.2% తగ్గాయని..  చొరబాట్లు 90% తగ్గాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాళ్లదాడి మొదలైన లా అండ్ ఆర్డర్ సమస్యలు 97% తగ్గాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు.  భద్రతా సిబ్బంది ప్రమాదాలు 65% తగ్గాయన్నారు. 2018లో రాళ్లు రువ్విన కేసులు 1,767 కాగా.. ఇప్పుడు అది జీరో అని చెప్పారు. 2018లో 52 సార్లు బంద్ లు నిర్వహిస్తే ఇపుడు ఎలాంటి బంద్ లు ఉండటం లేదని కోర్టుకు తెలిపారు. 

గతంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను  ఆగస్టు 5, 2019న తొలగించి  దానిని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది.

2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత  తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రం చెప్పింది. హోంమంత్రి అమిత్ షా కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు కానీ ఎలాంటి గడువు విధించలేదు.