
- ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు ..ఆగస్టు 18న వెళ్లి కలుస్తానని వెల్లడి
- పుతిన్, ట్రంప్ తో ఉమ్మడి సమావేశానికీ సిద్ధమన్న జెలెన్ స్కీ
- అలస్కా భేటీ తర్వాత జెలెన్ స్కీకి ట్రంప్ ఫోన్ కాల్
కీవ్:రష్యాతో యుద్ధాన్ని ఆపేందుకు, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఉక్రెయిన్ శాయశక్తులా కృషి చేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ పేర్కొన్నారు. శాంతి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈమేరకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ కాల్ తర్వాత జెలెన్ స్కీ ఈ ప్రకటన చేశారు.
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ట్రంప్ చర్చలు జరుపుతుండగా.. ఏకంగా శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా చర్చించాలని పుతిన్ కోరారు. ఈ ప్రతిపాదనను ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ముందుంచగా.. జెలెన్ స్కీ కూడా అంగీకరించారు. ఈ విషయంపై చర్చించేందుకు అమెరికా రావాలని ట్రంప్ తనను ఆహ్వానించినట్లు జెలెన్ స్కీ తెలిపారు. దీంతో సోమవారం తాను వాషింగ్టన్ బయలుదేరి వెళుతున్నానని పేర్కొన్నారు.
కాల్పుల విరమణ కానీ, శాంతి నెలకొల్పే ప్రక్రియ కానీ ఉక్రెయిన్ తరఫు నుంచి నిర్మాణాత్మక సహకారం తప్పకుండా అందిస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం రష్యా, అమెరికా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్లు ఉమ్మడిగా (త్రైపాక్షిక) సమావేశం కావాలంటూ ట్రంప్ చేసిన ప్రతిపాదననూ జెలెన్ స్కీ స్వాగతించారు.
అదే సమయంలో పీస్ డీల్ చర్చల్లో ప్రతీ దశలోనూ అమెరికాతో పాటు యురోపియన్ యూనియన్ దేశాల లీడర్లు కూడా పాల్గొనాలని కోరారు. నేతలందరి సమక్షంలో జరిగే ఒప్పందాలకు, సెక్యూరిటీకి మరింత విశ్వసనీయత కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, అలస్కాలో పుతిన్ తో భేటీ పూర్తయ్యాక వాషింగ్టన్ తిరిగి వెళుతూ జెలెన్ స్కీతో పాటు పలువురు నాటో లీడర్లతో ట్రంప్ ఫోన్ లో మాట్లాడారని అధికారవర్గాలు తెలిపాయి.