- సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రధానమంత్రి కొత్త కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. రైసినా హిల్ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ భవన సముదాయంలోకి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలోనే మారే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
నిర్మాణ దశలో ‘ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్’ గా పిలిచిన ఈ సముదాయానికి కేంద్ర ప్రభుత్వం ‘సేవా తీర్థ్’ అని నామకరణం చేసింది. ఈ ప్రాంగణంలో మొత్తం మూడు మెయిన్ బిల్డింగులు ఉన్నాయి. ఒకదాంట్లో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఉంటుంది. రెండో భవనం నుంచి కేబినెట్ సెక్రటేరియెట్ విధులు సాగుతాయి. మూడో భవనంలో జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్(ఎన్‌ఎస్‌సీఎస్)తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ కార్యాలయం ఉంటుంది.
ప్రత్యేకతలివే..
కొత్త కార్యాలయంలో విదేశీ ప్రముఖులు, అతిథులతో సమావేశమయ్యేందుకు వీలుగా హై-ఎండ్ రూమ్‌లను రూపొందించారు. ఇవి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండటమే కాకుండా.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉన్నాయి. ముఖ్యంగా కేబినెట్ సమావేశాల కోసం ఒక హాలును సిద్ధం చేశారు.
అధికారుల మధ్య సమన్వయం పెంచేందుకు ‘ఓపెన్ ఫ్లోర్’ మోడల్‌ను ఇక్కడ అమలుచేస్తున్నారు. కాగా.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధానమంత్రి కార్యాలయం సౌత్ బ్లాక్ నుంచే పనిచేస్తున్నది. తాజా మార్పుతో దశాబ్దాల చరిత్రకు తెరపడనుంది.
నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో ఉన్న హోం, ఫైనాన్స్, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలు ఇప్పటికే కొత్తగా నిర్మించిన ‘కర్తవ్య భవన్’ కు తరలివెళ్లాయి. ఖాళీ అయిన ఈ పురాతన కట్టడాలను భారీ మ్యూజియంగా మార్చనున్నారు. సేవా తీర్థ్ సమీపంలోనే ప్రధాని కొత్త నివాసం కూడా నిర్మాణం అవుతున్నది. ప్రస్తుతం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసాన్ని కూడా అక్కడికే మార్చనున్నారు.
