రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి ప్రక్రియ సింగపూర్‌లో జరుగుతోంది. లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి తన కిడ్నీని దానం చేస్తున్నారు. ఆమె తండ్రి కంటే ముందే వైద్యులు రోహిణికి శస్త్రచికిత్స చేశారు. తన తండ్రితో శస్త్రచికిత్సకు ముందు దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, నేను నా తండ్రికి కిడ్నీ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. అంతా శుభం జరగాలని నన్ను దీవించండి అంటూ పోస్టు పెట్టారు. తాను దేవుడిని చూడలేదని.. కాని తన తండ్రిలో దేవుడిని చూశానని రోహిణి చెప్పారు. తన తల్లిదండ్రుల కోసం తాను ఏమైనా చేయగలను అని పేర్కొన్నారు.
దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా ఉన్న యాదవ్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యల కారణంగా బెయిల్‌పై బయట ఉన్నారు. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఆయన్ని సింగపూర్‌కు తీసుకువెళ్లారు.

