కరీంనగర్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన కరీంనగర్లో కలకలం రేపింది. కరీంనగర్ ఆదర్శనగర్కు చెందిన గంగిశెట్టి లక్ష్మణ్(60).. కరీంనగర్ చుట్టుప్రక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ.. ప్రైవేటుగా చిట్టీలు నడుపుకుంటూ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులపాలయ్యాడు. అప్పులను తీర్చలేక.. అప్పులు ఇచ్చిన బాధితులు లక్ష్మణ్ను డబ్బులు అడుగుతుండటంతో.. తీవ్ర మానసిక వేదనకు లోనయ్యాడు.
వారికి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపంతో.. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటిలో ఉన్న తన భార్యకు బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రం 6:30 గంటల సమయంలో తన భర్త లక్ష్మణ్కు అతని భార్య ఫోన్ చేయగా.. పని ఉందని తర్వాత వస్తానని చెప్పి రాత్రి వరకు కూడా రాలేదు. భర్త కోసం ఎదురు చూస్తున్న ఆమెకు ఒక పిడుగు లాంటి వార్త తెలిసింది. ఒక వ్యక్తి తన భర్త ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ చేశాడు.
తీగల గుట్టపల్లిలోని రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక చెట్టుకు ఆమె భర్త ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకుని వేలాడుతున్నాడని కాల్ చేసి చెప్పాడు. వెంటనే ఆమె అక్కడికి వెళ్లి చూడగా తన భర్త ఉరివేసుకొని చనిపోయి వేలాడుతూ కనిపించాడు. ఆమె గుండె బద్ధలైనంత పనయింది.
ALSO READ : ఏటీఎంలో డబ్బులు నింపే వెహికల్ డ్రైవర్ తొమ్మిదిన్నర లక్షలతో జంప్..
పోలీసులకు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు. కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మార్చురీ గదికి మృతదేహాన్ని తరలించారు. లక్ష్మణ్ భార్య గంగిశెట్టి వినోద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అతని మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. లక్ష్మణ్ మృతదేహాన్ని అతని భార్యకు అప్పగించారు.
