Real Estate: నార్త్ ఇండియాలో కుప్పకూలిన రియల్టీ రంగం.. ఇళ్లు కొనేటోళ్లే లేరు..!

Real Estate: నార్త్ ఇండియాలో కుప్పకూలిన రియల్టీ రంగం.. ఇళ్లు కొనేటోళ్లే లేరు..!

Housing Sales Drop: ప్రస్తుతం ఇండియా-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇప్పటి వరకు అధికారిక సమాచారం ప్రకారం పాక్ ఆర్థికంగా చావుదెబ్బ తింది. కానీ మరో పక్క పాక్ పౌరుల నివాసాలను టార్గెట్ గా చేస్తు్న్న దాడులు రియల్టీ రంగాన్ని కుప్పకూల్చిందని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఉత్తర భారతదేశంలోని నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా క్షీణించాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తన నివేదికలో స్పష్టం చేసింది. భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న యుద్ద వాతావరణంతో స్వల్ప కాలంలో ఇళ్ల అమ్మకాలు 5-10 శాతం మధ్య పతనాన్ని చూస్తాయని శుక్రవారం అందించిన నివేదికలో స్పష్టం చేసింది. ఇదే సమయంలో కార్యాలయాలకు, రిటైల్ స్థలాలకు కూడా డిమాండ్ పడిపోతుందని అంచనా వేసింది. అయితే డిమాండ్ పూర్తిగా తగ్గిపోలేదని పేర్కొంది. 

ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు మరికొంత కాలం పాటు కొనసాగితే రియల్టీ రంగంలో పరిణామాలు దిగజారతాయని అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ & రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు. యుద్ధం కారణంగా నిర్మాణ రంగం నిలిచిపోతుందని.. ఇది ఇన్వెస్టర్లు, వినియోగదారుల్లో విశ్వాసాన్ని తగ్గిస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత రియల్టీ రంగం తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య దిల్లీ, ఎన్సీఆర్ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లోని అనేక యుద్ధ ప్రభావిత నగరాల్లో రియల్టీ అమ్మకాలు దాదాపుగా నిలిచిపోయాయి. పైగా ఇలాంటి సమయాల్లో లగ్జరీ ఇళ్లు కొనే కస్టమర్లు సైతం వేచి చూసే ధోరణిలోకి వెళతారని రియల్టీ నిపుణులు చెబుతున్నారు. ఇది అమ్మకాల్లో మందగమనానికి దారితీస్తుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మధ్యస్థ కాలంలో సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామాగ్రి ధరలు పెరుగవచ్చని రియల్టీ నిపుణులు చెబుతున్నారు. 

మరో పక్క పర్యాటక రంగం కూడా ప్రభావితం కావటంతో దిల్లీ, కశ్మీర్ సహా మరిన్ని నగరాల్లో హోటల్ బుక్కింగ్స్ భారీగా క్షీణిస్తున్నాయి. అలాగే మరోపక్క ఇప్పటికే చేసుకున్న బుక్కింగ్స్ కూడా ప్రయాణికులు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే భారత్ యుద్ధంలో గెలిస్తే మాత్రం కార్గిల్ సమయంలో మాదిరిగా విక్టరీ సెలబ్రేషన్ కోసం టూరిస్టులు భారీగా పర్యటనలు స్టార్ట్ చేస్తారని వారు చెబుతున్నారు. కరోనా సమయంలో కూడా రియల్టీ రంగం కొంత మేర ప్రభావితం అయినప్పటికీ ఆ తర్వాత వేగంగా తిరిగి పుంజుకున్న తీరును ఇందుకు ఉదహరిస్తూ.. రానున్న కాలంలో డిమాండ్ పెరుగుతుందని వారు చెబుతున్నారు.