- రాంగ్రూట్లో వచ్చి అడ్డుకున్న దుండుగులు
- తల, మెడపై కత్తులతో దాడి.. స్పాట్లోనే వ్యాపారి మృతి
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన
జవహర్ నగర్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని సాకేత్ కాలనీలో సోమవారం ఉదయం ఓ రియల్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి.. వేట కొడవళ్లతో నరికి.. బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. తన బిడ్డను స్కూల్లో దింపి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. దుండగులు బైక్, ఆటోలో వెంబడించి రియల్టర్‌ను చంపేశారని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. వెంకటరత్నం తన భార్య, ఇద్దరు కూతుళ్లతో సాకేత్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం తన కూతురిని స్కూల్లో దింపి ఇంటికి వెళ్తున్నాడు.
రోడ్ నంబర్ 4లోని ఫేజ్ 2కు వచ్చేసరికి బైక్, ఆటోలో రాంగ్రూట్లో వచ్చిన దుండగులు వెంకటరత్నంను అడ్డుకున్నారు. ఏం జరుగుతుందో అర్థం గాక.. టూ వీలర్‌ను అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఐదుగురు దుండగులు వెంబడించి వేట కొడవళ్లతో వెంకటరత్నంపై దాడి చేశారు. మెడ, తల భాగాల్లో విచక్షణారహితంగా నరికారు. అందరూ చూస్తుండగా పక్కనే ఉన్న బండరాయితో తలపై బాదారు. చివరికి పారిపోతూ.. ఓ దుండగుడు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ వెంకటరత్నం భుజంలోకి దూసుకెళ్లగా.. మరొకటి గురి తప్పింది.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జవహర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒక వేట కొడవలితో పాటు 6 ఎంఎం బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కాగా, దుండగులు హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఓ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. మృతుడు వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదై ఉంది. డబుల్ మర్డర్ కేసులోనూ నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది.
