కొమురవెల్లి పరిసరాల్లో రియల్టర్ల ఆగడాలు

కొమురవెల్లి పరిసరాల్లో రియల్టర్ల ఆగడాలు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: భూగర్భ జలాల పెంపునకు తోడ్పడే చెరువులపై రియల్టర్ల కన్ను పడింది. పక్కనే ఉన్న పట్టా భూములను కొనుగోలు చేసి కుంటలను ఆక్రమిస్తున్నారు. కళ్లెదురుగానే కబ్జాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో కుంటల ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందినా అటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో భూములకు ఇటీవలి కాలంలో విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది. దీంతో పలువురు రియల్టర్లు కొమురవెల్లి మండలంలో  వ్యవసాయ భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు చేసే భూముల సమీపంలో కుంటలుంటే వాటిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి వనరులున్న స్థలంలో పట్టా భూములున్నా కేవలం వ్యవసాయానికే ఉపయోగించుకోవాలే తప్ప వాటిని ఎట్టి పరిస్థితుల్లో పూడ్చవద్దనే నిబంధనలు ఉన్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. 

ఎర్రచెరువును మట్టితో పూడుస్తున్రు
ఐనాపూర్ గ్రామ శివారులోని ఎర్రచెరువు కుంటను రియల్టర్లు మట్టితో నింపుతూ ఆక్రమణకు తెర లేపారు. కుంట సమీపంలో పట్టా భూములుండటంతో అదే సాకుగా కుంట చుట్టూ మట్టి పోస్తున్నారు. కుంటకు మరొకవైపు మట్టి పోసి చిన్నపాటి రోడ్డును రెడీ చేయడం గమనార్హం. దాదాపు ఆరెకరాల విస్తీర్ణంలో ఉండే ఎర్రచెరువు కుంట కింద 25 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. తపాసుపల్లి రిజర్వాయర్ కు సమీపంలో ఉండటంతో ఎప్పుడూ నీటితో కళకళలాడుతుంటుంది. ఎర్రచెరువు కుంటను అక్రమంగా మట్టితో నింపుతున్న విషయంపై మత్స్య సంఘం జిల్లా డైరెక్టర్ తేలు ఇస్తారితో పాటు రైతులు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  రియల్టర్ల కారణంగా కుంట కుచించుకుపోయి తాము ఉపాధి కోల్పోతామని మత్స్యకార కుటుంబాలు పేర్కొంటున్నాయి.

కబ్జా కోరల్లో సాగుబాయి కుంట
రసూలాబాద్ పంచాయతీ పరిధి దాసారం గుట్ట సమీపంలోని సాగు బాయి కుంట కబ్జా కోరల్లో చిక్కుకుంది. దాదాపు 50 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ కుంటకు ఈజీఎస్ నిధులతో రిపేర్లు చేశారు. భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతున్న దీనిపై కొందరు రియల్టర్లు కన్నేసి ఏకంగా కుంట లోపలకి వచ్చి ప్రహారీ నిర్మించారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖుడికి సంబంధించినవారు కుంటలో కొంత భాగాన్ని మట్టితో పూడ్చి ప్రహారీ నిర్మించారని తెలుస్తోంది. 50 ఏండ్ల కింద నిర్మించిన సాగుబాయి కుంట ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకుని కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. 

తెట్టెకుంటపై తేల్చని అధికారులు
గురువన్న పేట శివారులోని తెట్టెకుంట కబ్జాకు గురవుతోందని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఎటూ తేల్చడం లేదు. దాదాపు వందేండ్ల క్రితం నిర్మించిన తెట్టెకుంట కింద వందెకరాల ఆయకట్టు ఉంది. గ్రామ నక్షా చిత్రంలో తెట్టెకుంట ఉన్నట్లుగా స్పష్టమైన ఆధారాలున్నాయి. ఇటీవలి కాలంలో కొందరు రియల్టర్లు కుంటలో మట్టిపోసి ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామ సర్పంచ్ తోపాటు రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడగా అధికారులకు ఫిర్యాదు చేశామని, అప్పట్లో ఆక్రమణలు నిలిచినా తరువాత మళ్లీ మొదలయ్యాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే ఆక్రమణలు
ఐనాపూర్ శివారులోని ఎర్రచెరువు కుంటను రియల్టర్లు కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రియల్టర్లు యథేచ్ఛగా కొంతకాలంగా కుంటను మట్టితో నింపుతున్నా అటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాం. చిన్న చిన్న కుంటలను కబ్జా చేయడం వల్ల వీటిపై ఆధారపడ్డ మత్స్య కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. కొమురవెల్లి మండలంలో ఆక్రమణలకు గురవుతున్న చిన్న నీటి కుంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  – తేలు ఇస్తారి, మత్స్యకార్మిక సంఘం జిల్లా డైరెక్టర్

ఫిర్యాదులపై విచారణ జరుపుతాం
కొమురవెల్లి మండల పరిధిలోని చిన్న నీటి కుంటల ఆక్రమణల ఫిర్యాదులపై విచారణ జరుపుతాం. ఐనాపూర్ శివారులోని ఎర్రచెరువు కుంట ఆక్రమణలపై ఫిర్యాదు రాగా ఎఫ్​టీఎల్​నిర్ధారణ చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించాం. ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే నిర్వహిస్తున్నారు. గురువన్నపేట తెట్టెకుంట ఆక్రమణలపై ఫిర్యాదు రావడంతో రికార్డులు పరిశీలిస్తున్నాం. ఇక్కడ కొంత పట్టా భూమి ఉండగా మిగిలిన  పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. రసులాబాద్​లోని సాగుబాయి కుంట ఆక్రమణలు మా దృష్టికి రాలేదు. ఆక్రమణకు ఎవరైనా ప్రయత్నిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనారాయణ, తహసీల్దారు, కొమురవెల్లి