- ఆదర్శంగా ఫిన్లాండ్ విద్యా నమూనా
- విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఒత్తిడి లేని చదువులు
- ఐదో తరగతి లోపే వందల పుస్తకాలు చదివిస్తరు
- ప్రతి క్లాస్కు ఒక రెగ్యులర్, సపోర్ట్ టీచర్లు.. మెటీరియల్ వారి ఇష్టమే
- తొమ్మిది గ్రేడ్ల తర్వాత ఒక్కటే సర్టిఫికెట్ ఇస్తరు
హైదరాబాద్, వెలుగు: చదువంటే మార్కులు, ర్యాంకుల వేట అని భావించే లోకానికి.. ఫిన్లాండ్ ఒక అద్భుతమైన పాఠం నేర్పుతోంది. అక్కడ చదువు గోస కాదు.. అదొక జాయ్‌ఫుల్ ప్రయాణం. విద్యార్థికి పూర్తి స్వేచ్ఛనిస్తూ, ఒత్తిడికి తావులేకుండా సాగే విద్యావిధానం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. 9 నెలల పసిప్రాయం నుంచే విద్యావ్యవస్థలో భాగస్వామ్యం కల్పించడం నుంచి, ఐదో తరగతిలోపు వందల పుస్తకాలు చదివించడం వరకు ప్రతి అంశం ఆశ్చర్యంగా ఉంటుంది.
ఇటీవల తెలంగాణ నుంచి విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ నేతృత్వంలోని 40 మంది టీం ఫిన్లాండ్ లో పర్యటించి, అక్కడి విద్యా విషయాలను తెలుసుకున్నారు. వాటిని తొలి విడతలో మన రాష్ట్రంలోని 28 పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
అన్ని సబ్జెక్టులకు ఇద్దరే టీచర్లు
ఫిన్లాండ్‌లో ప్రతి తరగతికి ఒక రెగ్యులర్ టీచర్‌తోపాటు అదనంగా ఒక సపోర్ట్టీచర్ ఉంటారు. క్లాస్‌లోని విద్యార్థులందరికీ అన్ని సబ్జెక్టులను వీరే బోధిస్తారు. పిల్లలకు ఆసక్తి ఉన్నప్పుడే పాఠాలు చెబుతారు. విద్యార్థులు ఎప్పుడైనా తరగతి గదిలో నుంచి బయటకు వెళ్లొచ్చు. అంతటి స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఆరో తరగతికి రాగానే ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే ల్యాప్‌టాప్ అందిస్తుంది. తద్వారా క్లాస్ టీచర్ చెప్పే పాఠాల్లోని అంశాలను వెనువెంటనే మరింత సమాచారంతో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
సెలవు పెడితే జీతంలో కోత
టీచర్ల విషయంలో ఫిన్లాండ్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. టీచర్లకు ఏడాదికి 190 పని దినాలుంటే, స్టూడెంట్లకు 180 రోజులే ఉంటాయి. టీచర్లకు సిక్ లీవులు 5 మాత్రమే ఇస్తారు. మిగతా సెలవులు ఉండవు. ఒకవేళ సెలవు పెడితే, ఆ క్లాస్ చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సన్‌ను టెంపరరీగా అరేంజ్ చేస్తారు. ఆ టీచర్‌కు ఇచ్చే జీతాన్ని రెగ్యులర్ టీచర్ జీతం నుంచి కట్ చేసి చెల్లిస్తారు.
ఉపాధ్యాయులపై ఎలాంటి నిఘా ఉండదు. ఇక్కడ టీచర్ వృత్తికి అత్యంత గౌరవం ఉంటుంది. కేవలం టాలెంట్ ఉన్న వారినే ఉపాధ్యాయులుగా ఎంచుకుంటారు. ప్రైమరీ టీచర్ కావాలన్నా కనీసం ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాల్సిందే. టీచర్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఏ పద్ధతిలో బోధించాలి, ఎలాంటి మెటీరియల్ వాడాలనేది వారే నిర్ణయించుకుంటారు. ప్రభుత్వం కేవలం గైడ్ లైన్స్ ఇస్తుంది. తనిఖీల పేరుతో అధికారులు వేధించరు. అందుకే అక్కడ టీచింగ్ ఒక ఆకర్షణీయమైన కెరీర్.
500 బుక్స్ చదివితే డిప్లొమా సర్టిఫికెట్
పిల్లల పుస్తక పఠనానికి ఫిన్లాండ్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి స్టూడెంట్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పూర్తి చేసేలోపు కనీసం 500 పుస్తకాలు చదవాలి. అలా చదివిన వారికి రీడింగ్ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. దీంతో చిన్నతనం నుంచే పిల్లల్లో విజ్ఞానం, సృజనాత్మకత పెరుగుతాయి.
మరోవైపు పిల్లలకు వచ్చిన మార్కులను ఎవరికీ చెప్పరు. ఫలితంగా ఒక విద్యార్థిని మరో విద్యార్థితో పోల్చే అవకాశం ఉండదు. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆహ్లాదంగా చదువుకుంటారు.
ఏడేండ్లు నిండితేనే ఒకటో తరగతి
ఫిన్లాండ్‌లో పిల్లల వికాసం ఆటపాటలతోనే మొదలవుతుంది. ఆరేండ్ల వరకు ఇచ్చే ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్(ఈసీఈ)లో పిల్లల ఎదుగుదలకు ప్రాధాన్యత ఇస్తారు. 9 నెలల వయసున్న చిన్నారులనూ ఇందులో చేర్పించొచ్చు. ఆరో ఏట ప్రీ-ప్రైమరీ క్లాసులు ఉంటాయి. ఏడేండ్లు నిండిన తర్వాతే ఒకటో తరగతిలో చేర్పిస్తారు. అసలైన పాఠశాల విద్య ఈ వయసులో ప్రారంభమై తొమ్మిదేండ్లపాటు సాగుతుంది. దీన్నే కాంప్రిహెన్సివ్ స్కూల్ అంటారు.
ఇక్కడ 1 నుంచి 9 గ్రేడ్ల వరకు చదువు ఉంటుంది. మొదటి ఆరేండ్లు ఒకే క్లాస్ టీచర్ ఉంటే, చివరి మూడేళ్లు సబ్జెక్ట్ స్పెషలిస్టులు బోధిస్తారు. విద్యార్థి ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు, ఒక స్థాయి నుంచి మరో స్థాయికి ఎప్పుడైనా మారుతూ తన చదువును కొనసాగించొచ్చు. విద్యార్థుల అభ్యసన తీరుపై టీచర్లు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. తొమ్మిదో గ్రేడ్ చివరలో ఇచ్చే సర్టిఫికెటే పైచదువులకు కీలకం.
