బీసీలు లేని చోట్లా బీసీ రిజర్వేషన్లు!

బీసీలు లేని చోట్లా బీసీ రిజర్వేషన్లు!
  • ఎస్సీ, ఎస్టీలు లేని పల్లెల్లోనూ అదే సీన్​
  • లోకల్​ రిజర్వేషన్లలో పలుచోట్ల గందరగోళం
  • 2011 జనాభా ప్రకారమే ప్రకటించామన్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: లోకల్​బాడీ ఎన్నికలకు ఇటీవల అధికారులు ప్రకటించిన రిజర్వేషన్లు పలుచోట్ల గందరగోళానికి దారితీశాయి.  ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా లేని గ్రామాల్లో ఆయావర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించడమే ఇందుకు కారణం.  ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా తక్కువగా ఉన్న పల్లెల్లోనూ ఆయా వర్గాలకు స్థానాలు రిజర్వ్ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మిగిలిన వర్గాల ఆశావహులు నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు వెలుగుచూస్తుండడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. 

 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ డెడికేటెడ్​కమిషన్​ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ప్రకటించామని, 14 ఏండ్ల క్రితం గ్రామాల్లో ఉన్న ఆయా వర్గాలు  వలస వెళ్లడం వల్ల కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయని, మిగిలిన చోట్ల ఎలాంటి సమస్య లేదని చెప్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తిరిగివచ్చి నామినేషన్​వేసే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు.  కాగా, ఒక్కసారి రిజర్వ్​అయ్యాక ఎవరూ నామినేషన్​ వేయకపోతే..ఆ గ్రామాన్ని వెకెన్సీ లిస్ట్​లో చూపించి మళ్లీ నోటిఫికేషన్​ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. 

2011లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడంతో..

2022లో నిర్వహించాల్సిన జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ రావడంతో తాజాగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అధికారులు 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకున్నారు.  ఆ ప్రకారమే ఆయా వర్గాల రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ లెక్కలు చాలా పాతవి కావడం.. ఈ 14 ఏండ్లలో బతుకుదెరువుకోసం అనేక కుటుంబాలు ఆయా గ్రామాల నుంచి వలస వెళ్లడం.. ఆ వివరాలు అందుబాటులో లేక  రిజర్వేషన్లు ప్రకటించడంతో సమస్య ఏర్పడినట్లు తెలుస్తున్నది.

 ఇక  బీసీ రిజర్వేషన్ల కేటాయింపులో బీసీ డెడికేటెడ్​ కమిషన్​ నివేదికను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ గతంతో పోలిస్తే బీసీ రిజర్వేషన్ శాతం పెరగడం, రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో  కేటాయించడంతో  పొరపాట్లు జరిగినట్లు తెలుస్తున్నది. 

ఇవిగో ఉదాహరణలు..

  వరంగల్​ జిల్లా సంగెం మండలం వంజరపల్లె గ్రామంలో ఎస్టీలు లేకున్నా.. సర్పంచ్​స్థానాన్ని ఎస్టీకి కేటాయించారు. దీంతో సోమవారం వరంగల్​ జిల్లా అడిషనల్​ కలెక్టర్​ సంధ్యారాణిని వంజర పల్లె ప్రజలు  కలిసి వినతి పత్రం అందజేశారు. ‘‘ఈ గ్రామంలో  373 మంది ఓటర్లున్నారు. ఎస్టీ కుటుంబాలే లేవు. నామినేషన్​ పడే అవకాశం లేనందున తక్షణమే కలెక్టర్​ స్పందించి..ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్​ ఇవ్వాలి” అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్​ సోమిడి శ్రీనివాస్ కోరారు.

  కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ పంచాయతీలో ఎస్టీలెవరూ లేకున్నా సర్పంచ్​పదవిని ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
 నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము మండలంలో బాచాపూర్, దామరచర్ల మండలంలోని బండావత్ తండా గ్రామాల్లో ఉన్నది మొత్తం  ఎస్టీ ఓటర్లు మాత్రమే. కానీ, ఈ రెండు గ్రామాల్లో సర్పంచ్​పదవులను  బీసీలకు  రిజర్వ్​ చేశారు. ఇదే జిల్లా మాడుగులపల్లి మండలంలోని ఇందుముల గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఇద్దరే ఉండగా..  ఒక సర్పంచ్,  నాలుగు వార్డులను ఎస్టీలకు రిజర్వ్​చేశారు.

 ఈ గ్రామంలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నప్పటికీ  ఒక్క వార్డు కూడా ఆ వర్గానికి రాకపోవడంతో ఆశావహులు ఖంగుతిన్నారు. ఇదే మండలంలోని  చెరువుపల్లి గ్రామంలో ముగ్గురు ఎస్టీ ఓటర్లు మాత్రమే ఉండగా 3 వార్డులను ఎస్టీలకు కేటాయించారు.   ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని మంగళతండాలో బీసీలెవరూ లేకున్నా బీసీ మహిళకు సర్పంచ్ పదవి రిజర్వ్​ చేశారు.