
- తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇదే ఆధారం
- 93శాతం మంది పరిస్థితి ఇదే
ముంబై:తక్కువ ఆదాయ వర్గాలు క్రెడిట్ కార్డులపై విపరీతంగా ఆధారపడుతున్నాయని తాజా స్టడీ వెల్లడించింది. నెలకు రూ. 50 వేల కంటే తక్కువ సంపాదించే వారిలో దాదాపు 93 శాతం మంది ప్లాస్టిక్ మనీ (క్రెడిట్ కార్డులు) పై ఆధారపడుతున్నారని తెలిపింది.
స్వయం ఉపాధి పొందే వారిలో 85 శాతం మంది తమ ఆర్థిక అవసరాలకు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. 'ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి' (బీఎన్‌పీఎల్ లోన్లు) లోన్ల వినియోగం కూడా గణనీయంగా ఉంది.
స్వయం ఉపాధి పొందే వారిలో 18 శాతం మంది, జీతభత్యాలు పొందే వారిలో 15 శాతం మంది బీఎన్‌పీఎల్ లోన్లు తీసుకుంటున్నారని థింక్డాట్ఏఐ నిర్వహించిన స్టడీ పేర్కొంది. క్రెడిట్ కార్డులు, బీఎన్‌పీఎల్ లోన్లను సాధారణ ఉద్యోగులతోపాటు గిగ్ వర్కర్లూ వాడుతున్నారని థింక్360 సీఈఓ అమిత్ దాస్ అన్నారు.
భారతదేశంలో 12 నెలల కాలంలో 20వేలమందికి పైగా జీతం పొందేవారు ,స్వయం ఉపాధి పొందే వ్యక్తుల ఆర్థిక పరిస్థితులను విశ్లేషించిన థింక్డాట్ఏఐ అధ్యయనం..స్వయం ఉపాధి పొందే వ్యక్తులలో 85 శాతం మంది క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నారని తెలిపింది. భారతదేశ డిజిటల్ రుణ విప్లవానికి నాయకత్వం వహిస్తున్న ఫిన్‌టెక్‌ల పెరుగుతున్న ఆధిపత్యాన్ని కూడా ఈ అధ్యయనం చెబుతోంది.
2023 ఆర్థిక సంవత్సరంలో ఫిన్‌టెక్‌లు రూ.92వేల కోట్లకు పైగా వ్యక్తిగత రుణాలను పంపిణీ చేశాయని,మొత్తం కొత్త రుణాలలో 76 శాతం వాటా ఉందని అధ్యయనంలో తెలిసింది.