
చల్లటి వేళ బెల్లం రుచులు
అరటి పండ్లు, కొర్రలు, గోధుమ రవ్వ... వీటిని బెల్లంతో కలిపి వండితే లాప్సి, బర్ఫీ, బోండా రెడీ. ఇవి టేస్టీగా ఉండటమే కాదు, హెల్దీ కూడా. చలికాలంలో బెల్లం తినడం అవసరం. అందుకే రుచికరంగా ఉండే ఈ తియ్యటి వంటకాలు చేసేయండి.
కొర్రల బర్ఫీ
కావాల్సినవి :
కొర్రలు – ఒక గ్లాస్, నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు, బెల్లం – రెండు గ్లాసులు
పాలు – మూడు గ్లాసులు, యాలకుల పొడి – ఒక టేబుల్ స్పూన్, బాదం పలుకులు – కొన్ని
తయారీ :
కొర్రల్ని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక పాన్లో పాలు పోసి కాగబెట్టాలి. పాలు కాగాక, అందులో కొర్రలు వేసి మూతపెట్టి పావు గంట ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం పొడి కలపాలి. ఆ మిశ్రమంలో నెయ్యి, బాదం పలుకులు వేసి మరికాసేపు గరిటెతో కలుపుతూ ఉడకబెట్టాలి. మిశ్రమం దగ్గరపడ్డాక, నెయ్యి పూసిన ప్లేట్లోకి తీయాలి. ఇరవై నిమిషాలు పక్కన ఉంచి, తర్వాత చాకుతో బర్ఫీ షేప్లో ముక్కలు కోయాలి.
లాప్సి
కావాల్సినవి :
గోధుమరవ్వ, బెల్లం – ఒక్కోటి అర కప్పు చొప్పున
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు
నీళ్లు – రెండున్నర కప్పులు
పెసర పప్పు – రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – ఒక టీస్పూన్
జీడిపప్పులు, కిస్మిస్, బాదం పలుకులు – కొన్ని, లవంగాలు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
తయారీ :
పాన్లో గోధుమ రవ్వ, పెసరపప్పు విడివిడిగా వేగించి పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్లో బెల్లం వేసి, అర కప్పు నీళ్లు పోసి మూత పెట్టి రెండు నిమిషాలు కరగబెట్టాలి. మరో పాన్లో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించి, అందులో వేగించిన గోధుమ రవ్వ, పెసరపప్పు వేసి మూతపెట్టి మరికాసేపు ఉడికించాలి. అవి ఉడికాక, బెల్లం నీళ్లు పోసి కలపాలి. మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. చివరగా ఒక పాన్లో నెయ్యి వేసి, అందులో జీడిపప్పులు, కిస్మిస్, లవంగాలు, దాల్చిన చెక్క వేగించాలి. వాటితో పాటు బాదం పలుకుల్ని కూడా ఉడికించిన గోధుమరవ్వ మిశ్రమంలో వేసి కలిపితే రుచిగా ఉండే లాప్సి రెడీ. కావాలంటే ఇందులో పాలు లేదా కొబ్బరి పాలు కూడా కలపొచ్చు.
బనానా బోండా
కావాల్సినవి :
అరటిపండ్లు – ఎనిమిది లేదా పది, నూనె – సరిపడా, గోధుమ పిండి – ఒక కప్పు , బొంబాయి రవ్వ – అర కప్పు , బెల్లం – ఒకటిన్నర కప్పు
యాలకులు – కొన్ని
తయారీ :
అరటి పండ్లు తొక్క తీయకుండా నూనెలో వేగించాలి. చల్లారాక, తొక్క తీసి మెదపాలి. అందులో బొంబాయి రవ్వ, యాలకులు,
పొడి చేసిన బెల్లం కలపాలి. మూత పెట్టి, అరగంట పక్కన పెట్టాలి. ఆ తర్వాత అందులో గోధుమ పిండి వేసి బాగా కలపాలి. ఒక పాన్లో నూనె బాగా మరిగించి, అరటి పండ్ల మిశ్రమంతో చిన్న చిన్న బోండాలు వేయాలి. టీ, కాఫీ టైంలో శ్నాక్స్గా తింటే ఎంజాయ్ చేయొచ్చు.