పెద్ద ప్లానింగే.. ఇకపై ఇళ్లలో వాడే సిలిండర్లో.. గ్యాస్ 14.2 కేజీలు ఉండదా..? ఎంత ఉండొచ్చు..?

పెద్ద ప్లానింగే.. ఇకపై ఇళ్లలో వాడే సిలిండర్లో.. గ్యాస్ 14.2 కేజీలు ఉండదా..? ఎంత ఉండొచ్చు..?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం చమురు సంక్షోభానికి దారితీస్తున్న తరుణంలో భారత్లో ఎల్పీజీ కష్టాలను తీర్చేందుకు భారత్ ఎల్పీజీ సరఫరాకు సంబంధించిన ఒక సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇళ్లలో వంట కోసం వాడే గ్యాస్ సిలిండర్లో 14.2 కేజీల గ్యాస్ ఉంటుంది. ఇకపై ఈ క్వాంటిటీని 10 కేజీలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ చర్య వల్ల.. ఈ సంక్షోభ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులకు గ్యాస్ సప్లై చేయొచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా తెలిసింది.

14.2 కేజీల గ్యాస్తో నింపిన సిలిండర్ సుమారుగా 35 రోజుల నుంచి 40 రోజుల వరకూ ఒక సగటు కుటుంబ వంట అవసరాలను తీరుస్తుంది. అయితే.. 10 కేజీలతో నింపిన సిలిండర్ కూడా పొదుపుగా వాడుకుంటే దాదాపుగా నెల రోజులు వరకూ ఒక కుటుంబ అవసరాలను తీరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడితే ఎల్పీజీ సిలిండర్లపై లేబుల్స్ను మార్చాల్సి ఉంటుంది.

14.2 కేజీల స్థానంలో 10 కేజీల క్వాంటిటీని ముద్రించాల్సి ఉంటుంది. సిలిండర్ బరువు గతంలో కంటే తగ్గిందని వినియోగదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే ముందుగా.. కంపెనీలు గ్యాస్ సిలిండర్ల సైజును మార్చాల్సి ఉంటుంది. రెగ్యులేటరీ అప్రూవల్ వచ్చాకే ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వినియోగదారులు యుద్ధ భయంతో ఏ క్షణమైనా ఇబ్బంది కలగొచ్చని ఒకటికి రెండు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు.

Also Read : వంట గ్యాస్, పెట్రోల్ డీజిల్పై లోక్ సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన

ఈ పరిణామం కూడా గోడౌన్లలో డొమెస్టిక్ సిలిండర్ల నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం అప్పటికీ సిలిండర్ బుకింగ్ వ్యవధిని పెంచడం గమనార్హం. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులు గ్యాస్ బుకింగ్ విషయంలో నానా తిప్పలు పడుతున్నారు. గ్యాస్ గోదాం దగ్గర ప్రజలు క్యూ కడుతున్న పరిస్థితులున్నాయి.

ఒకవైపు కొరత లేదని చెప్తూనే బుక్ చేసుకున్న ఓటీపీ రావడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇండెన్, భారత్ గ్యాస్ కోసం బుక్ చేసుకున్న కంపెనీలు విధించిన టైం దాటిపోయిన ఓటీపీలు రోజుల తరబడి రావడంలేదని ఆరోపిస్తున్నారు. హార్మూజ్‌‌‌‌ జలసంధిని సురక్షితంగా దాటి LPG ట్యాంకర్ షిప్స్ భారత్కు చేరుకుంటున్నా గ్యాస్ కొరత భారత్లో ఇప్పటికీ పూర్తిగా ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం.