కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అయిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కాంబో ఇండస్ట్రీలో మరో అరుదైన ఘనతను సాధించబోతోంది. దర్శకుడు ప్రియదర్శన్ తన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తొలి చిత్రం పూచక్కోరు మూక్కుత్తులో నటించిన మోహన్ లాలే ఇందులోనూ హీరోగా నటిస్తున్నాడు..
లేటెస్ట్గా ఈ సినిమా గురించి మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘‘వంద సినిమాలు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని, అది సినిమాపై ఉన్న అంకితభావానికి, అభిరుచికి నిదర్శనమని పేర్కొన్నాడు. తన స్నే హితుడి సుదీర్ఘ ప్రయాణాన్ని దగ్గరుండి చూసే భాగ్యం తనకు దక్కిందని’’ మోహన్ లాల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు.
Some milestones do not belong to one person alone. They belong to everyone who stood close enough to witness the journey.
— Mohanlal (@Mohanlal) March 21, 2026
My dearest Priyan is stepping into his 100th film, and I find myself without words for what that truly means to me.
A hundred films is not just a number. It… pic.twitter.com/9AXJyjTNdW
మొదటి సినిమా పూచక్కోరు మూక్కుతి తోనే ఘనవిజయాన్ని అందుకున్న ఈ ద్వయం ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వీరి కాంబోలో వచ్చిన కాలాపానీ అద్భతమైన విజయంతో పాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అలా ఒక డైరెక్టర్ ఫస్ట్ మూవీ మరియు 100వ సినిమాల్లో ఒకే హీరో నటించడం అనేది ఇండస్ట్రీలోనే ఒక అరుదైన రికార్డు. ఈ క్రమంలోనే మూవీ చరిత్ర సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కథ & జానర్:
ప్రస్తుతం కథ వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం మ్యూజికల్ జానర్‌లో ఉండబోతుందనే సమాచారం ఉంది. ఇప్పటివరకు కామెడీ, డ్రామా సినిమాలతో గుర్తింపు పొందిన ప్రియదర్శన్ ఈసారి సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చే కథను ఎంచుకోవడం ఆసక్తికరం.
ప్రియదర్శన్ తెలుగు సినిమాలు:
ప్రియదర్శన్.. ఒక సినీ దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలో 6, తెలుగులో రెండు సినిమాలు చేశాడు. తెలుగులో ఆయన తీసిన రెండు సినిమాలు నాగార్జునతో 'నిర్ణయం', బాలకృష్ణతో "గాండీవం". ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇకపోతే.. డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురే.. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని. హలో, చిత్రలహరి, లోకా: ఛాప్టర్ 1 - చంద్ర సినిమాల్లో నటించి మెప్పించింది.
