- అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం ఉంటుందన్న మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్నాయి. తనను టార్గెట్ చేస్తూ ఆయన ఇటీవల చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని వెంటనే తేల్చాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను కోరినట్లు సమాచారం.
దీంతో రాజగోపాల్ రెడ్డి విమర్శలకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులు, పేపర్ కటింగులతో మహేశ్ గౌడ్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంపై గురువారం మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్.. బుధవారం రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలతో పాటు గతంలో ఆయన చేసిన ఆరోపణలను పీసీసీ, ఏఐసీసీ నాయకత్వం పరిశీలిస్తాయని చెప్పారు. హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయనపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.
చర్యలు తీసుకోవాల్సిందే: చనగాని దయాకర్
రాజగోపాల్ రెడ్డి తీరుపై ఆయన సొంత ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా గళం విప్పారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీని వీడకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో రాజగోపాల్ రెడ్డి తీరును తప్పుపట్టారు.
ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేస్తున్న ఇలాంటి వారిని ఉపేక్షించరాదని, వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ తరఫున గెలవలేని రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారని దయాకర్ గుర్తు చేశారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ ద్వారానే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు పొందిన ఆయన.. ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రజా పాలనలో ఆయన చేసిన త్యాగమేమీ లేదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి బీ ఫామ్ తీసుకొని గెలిచారని అన్నారు. పార్టీ లేకుంటే ఆయనకు రాజకీయ ఉనికే ఉండేది కాదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారని నిలదీశారు.
కాంట్రాక్ట్ రాలేదని విమర్శలా: పున్న కైలాశ్ నేత
నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేత కూడా రాజగోపాల్ రెడ్డిపై తీవ్రంగా స్పందించారు. గురువారం నల్గొండ టౌన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కొనసాగాలనుకుంటే క్రమశిక్షణతో ఉండాలని, లేదంటే వెంటనే పార్టీని వీడాలని హెచ్చరించారు. మంత్రి పదవి రాలేదని పార్టీని, ప్రభుత్వాన్ని రోడ్డుకు ఈడ్చడం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టులు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై కత్తి కడతారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఉంటూనే ఆ పార్టీని కూల్చే ప్రయత్నం చేస్తారా? డిసెంబర్లో మంత్రి పదవి ఇస్తే ఇప్పటి వరకు చేసిన విమర్శలన్నీ మాఫీ అవుతాయా? అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఆధారాలతో సహా ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పార్టీ సహనానికి కూడా హద్దు ఉంటుందని, గీత దాటితే ఎవరిపైనైనా వేటు తప్పదని హెచ్చరించారు.
