కేజీబీవీ సీట్లకు ఫుల్ డిమాండ్..స్టేట్లో ఇప్పటికే 1,42,947 అడ్మిషన్లు

కేజీబీవీ సీట్లకు ఫుల్ డిమాండ్..స్టేట్లో ఇప్పటికే 1,42,947 అడ్మిషన్లు
  •  గతేడాది కంటే 17 వేలు పెరిగిన స్టూడెంట్లు 
  • సీట్ల కోసం ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు 

హైదరాబాద్, వెలుగు: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో సీట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి అడ్మిషన్లు భారీగా పెరిగాయి. స్కూళ్లలోని సీట్ల పరిమితికి మించి అడ్మిషన్లు జరగడమే దీనికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా 495 కేజీబీవీలు ఉండగా.. వాటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు క్లాసులు నడుస్తున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా మిగిలిన 31 జిల్లాల్లో కేజీబీవీలున్నాయి. ముందు టెన్త్ వరకే ఉండగా, దశల వారీగా ఇంటర్మీడియెట్ క్లాసులు కొనసాగిస్తున్నాయి.

 ప్రస్తుతమున్న వాటిలో 403 కేజీబీవీలు ఇంటర్ వరకు అప్​గ్రేడ్ అయ్యాయి. ప్రతీ క్లాసులో 40 సీట్లున్నాయి. ప్రస్తుతం ఆరో తరగతిలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.  ఇప్పటివరకు 1,42,947 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. అయితే, గతేడాది కేజీబీవీల్లో 1,25,998 మంది చేరారు.  ఈ లెక్కన ఈ ఏడాది సుమారు 17వేల అడ్మిషన్లు  పెరిగాయి. ఒకటి రెండు కాదు.. అన్ని జిల్లాల్లోనూ విద్యార్థుల సంఖ్య పెరిగింది.

 ఈ నేపథ్యంలో కేజీబీవీల్లో సీట్ల కోసం తమ సెగ్మెంట్లలో విద్యార్థుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఫోన్లు చేస్తుండటం గమనార్హం. దీంతో పలు కేజీబీవీల్లో ఒక్కో క్లాసులో40 మంది ఉండాల్సి ఉండగా.. 50, 60 మంది దాకా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి జిల్లాలోనూ ఈ సారి అడ్మిషన్లు పెరిగాయి. కనీసం 250 నుంచి వెయ్యి దాకా ఎక్కువ విద్యార్థులు చేరారు.  అయితే, టెన్త్, ఇంటర్  ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు రావడం, బాలికల భద్రతపై సర్కారు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో పేరెంట్స్ కేజీబీవీల్లో తమ పిల్లలను చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. 

రాష్ట్రంలోని టాప్ కేజీబీవీలివే..

జిల్లా              కేజీబీవీలు       గతేడాది స్టూడెంట్లు      ప్రస్తుతం 
నల్గొండ                       27           6,911                           7,886 
రంగారెడ్డి                     20           6,530                           7,418 
నిజామాబాద్               27           6,131                            7,020 
నాగర్ కర్నూల్           20           5,751                            6,562 
నిర్మల్                        18           5,631                             6,477
కామారెడ్డి                    19            5,536                            6,101