
చిట్యాల, వెలుగు: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేలంలో లడ్డూను ఓ ముస్లిం దక్కించుకున్నారు. చిట్యాల టౌన్ లోని గ్రీన్ గ్రో స్కూల్ విద్యార్థులు, మేనేజ్ మెంట్ ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద శనివారం లడ్డూ వేలం వేశారు. స్కూల్ లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థి సోనూ సోహైల్ తండ్రి షేక్ అజీముద్దీన్ వేలంలో పాల్గొని రూ. 6,516కు లడ్డూను కైవసం చేసుకున్నారు.
అనంతరం అజీముద్దీన్ మాట్లాడుతూ... గణపతి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా స్నేహభావంతో మెలగాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన షేక్ అజీముద్దీన్ ను పాఠశాల మేనేజ్ మెంట్, ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్దన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.