రూపాయి భారీ పతనం: డాలర్‌తో 90కి చేరువలో మారకపు విలువ..

రూపాయి భారీ పతనం: డాలర్‌తో 90కి చేరువలో మారకపు విలువ..

డిసెంబర్ నెల మెుదటి రోజున భారత రూపాయి మారకపు విలువ డాలర్ తో పోల్చితే చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంట్రాడేలో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.89.83కి చేరింది. ఇది శుక్రవారం ముగింపు ధర రూ.89.35తో పోలిస్తే ఒక్క రోజులోనే ఇది 48 పైసలు పతనాన్ని చూడటం గమనార్హం. దీంతో రూపాయి మారకపు విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్టాలకు పడిపోతోంది. దాదాపుగా ఒక డాలర్ విలువ రూ.90కి చేరువలోకి వచ్చేసింది. 

రూపాయి పతనానికి కీలక కారణాలు..

1. అమెరికా ఫెడ్ రేటు అనిశ్చితి: ఊహించిన దానికంటే మెరుగైన అమెరికా జాబ్స్ రిపోర్ట్ కారణంగా.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు సన్నగిల్లాయి. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కరెన్సీలపై ముఖ్యంగా రూపాయిపై పడిందని నిపుణులు చెబుతున్నారు.
2. డాలర్లకు పెరిగిన డిమాండ్: దేశంలోని దిగుమతిదారులు తమ చెల్లింపు అవసరాల కోసం డాలర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం.. మరోపక్క ఎగుమతిదారులు సరఫరాలు తగ్గటం రూపాయిని మరింత బలహీనం మార్చేసింది.
3. విదేశీ పెట్టుబడులు వెనక్కి: ఆగస్టు చివర్లో అమెరికా, భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలు విధించినప్పటి నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల నుంచి దాదాపు16.5 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 2025లో ఆసియా కరెన్సీలలో అత్యంత బలహీనమైనదిగా రూపాయి నిలిచింది. డాలర్‌తో పోలిస్తే ఇప్పటివరకు 4.3% విలువ పతనం అయ్యింది రూపాయిది.

►ALSO READ | మెుదటి సారి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అలా మాత్రం అస్సలు చేయెుద్దు

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టమైన పురోగతి లేకపోవడం, అనిశ్చితి కారణంగా రూపాయి పతనం రూ. 90 మార్కు వైపు కొనసాగవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ ఎల్‌కేపీ సెక్యూరిటీస్ నిపుణుడు జతీన్ త్రివేది అన్నారు. ట్రేడ్ డెఫిసిట్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఉపసంహరణలు, అమెరికా సుంకాలు, నిలిచిపోయిన వాణిజ్య చర్చలు రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్‌కు చెందిన జిగర్ త్రివేది తెలిపారు. ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం ఉండటం రూపాయికి తాత్కాలిక మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు.