భారీ మెజార్టీతో గెలిచిన డింపుల్ యాదవ్ 

భారీ మెజార్టీతో గెలిచిన డింపుల్ యాదవ్ 

మెయిన్‌పురి లోక్‌సభ ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి  డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొంది ఎస్పీ విజయ పరంపరను కొనసాగించారు. బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యా పై ఆమె 2.88 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. డింపుల్‌కు 6,18,120 ఓట్లు రాగా, రఘురాజ్ షాక్యాకు 3,29,659 ఓట్లు వచ్చాయి. 

2019లో ములాయం సింగ్ యాదవ్...ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ షక్యాపై 94,389 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఈ సారి డింపుల్ యాదవ్...అంతకు మించిన మెజార్టీతో గెలుపొందారు.  అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ కు ఉపఎన్నిక అనివార్యమైంది. 

మెయిన్‌పురి లోక్‌సభ ఉపఎన్నికలో ఎస్పీ విజయం సాధించడం పై డింపుల్ యాదవ్ స్పందించారు.  "మా విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మినందుకు మెయిన్‌పురి ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ విజయాన్ని దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ కు అంకితం చేస్తున్నాను" అని డింపుల్ యాదవ్ అన్నారు. 

యూపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ తిరిగి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.తన పార్టీని  సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేశారు.  ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు.