కోలుకున్నోళ్లలో యాంటీబాడీలు.. ఎక్కువ రోజులు ఉంటలే

కోలుకున్నోళ్లలో యాంటీబాడీలు.. ఎక్కువ రోజులు ఉంటలే

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో 1,800 మందిపై సర్వే

40% మందిలో త్వరగానే యాంటీబాడీలు మాయం

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో  1,800 మందిపై సర్వే

అహ్మదాబాద్: కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తుల్లో యాంటీ బాడీలు ఎక్కువ రోజులు ఉండటం లేదట. కొద్ది మందిలో మాత్రమే వైరస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన యాంటీబాడీలు కన్పిస్తున్నాయట. అహ్మదాబాద్ సిటీలో కరోనా బారిన పడి, కోలుకున్న 1800 మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. మార్చి, జులై మధ్య కరోనా పాజిటివ్ వచ్చిన 1800 మందిపై సర్వే నిర్వహించినట్లు ఎంఈటీ మెడికల్ కాలేజ్ డాక్టర్ జయ్ సేథ్ చెప్పారు. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 40 శాతం మంది కరోనా యాంటీబాడీలను కోల్పోయారని, కొందరిలో మాత్రం యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కరోనా యాంటీ బాడీలను త్వరగా కోల్పోవడం వల్ల వీరికి వైరస్ రీఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవీన్ సోలంకీ వెల్లడించారు. ఇప్పటి వరకు పలు దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ వైరస్ సోకుతున్నట్లు పలు కేసులు వెలుగుచూశాయని తెలిపారు. అయితే కొంతమందిలోనే యాంటీబాడీలు ఎందుకు త్వరగా పోయాయన్న దానిపై మరింత పెద్ద ఎత్తున స్టడీ జరగాల్సిన అవసరం ఉందని ఎపిడెమిక్ ఎక్స్ పర్ట్ డాక్టర్ ఆర్.కె. పటేల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్కులు ధరించడమే వైరస్ నుంచి కాపాడుకునేందుకు ఉన్న మంచి మార్గమని సూచించారు.

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌లో 3 నెలల్లో తొలి కరోనా మరణం..

మూడు నెలల కిందటే కరోనా ఫ్రీ కంట్రీగా ప్రకటించిన న్యూజిలాండ్ లో శుక్రవారం మళ్లీ ఒక కరోనా పేషెంట్ చనిపోయాడు. దేశంలో గత మూడునెలల్లో కరోనా పేషెంట్ చనిపోవడం ఇదే తొలిసారి. ఆక్లాండ్ లో గత నెలలో సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని, అప్పుడే వైరస్ బారిన పడిన ఓ 50 ఏళ్ల వ్యక్తి శుక్రవారం పరిస్థితి విషమించి, చనిపోయాడని అధికారులు తెలిపారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 23కు చేరిందన్నారు.