టెట్​ ముగిశాక టీఆర్టీ జాప్యంలో అర్థం లేదు

టెట్​ ముగిశాక టీఆర్టీ జాప్యంలో అర్థం లేదు

రా ష్ట్రంలో దాదాపు 20 వేలకు పైగా టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు చెప్పేందుకు సరిపోను సార్లు లేరు.  వేల బడుల్లో ఒకరిద్దరు టీచర్లతోనే విద్యాబోధన జరుగుతోంది. ఈ ఏడాది ఇంగ్లిష్​మీడియం కూడా ప్రవేశపెట్టడంతో టీచర్ల అవసరం మరింత పెరిగింది. సమస్య తీవ్రత దృష్ట్యా టీచర్ల రిక్రూట్​మెంట్​ను వేగంగా చేపట్టాల్సిన ప్రభుత్వం.. ఆ దిశగా ముందుకు కదలడం లేదు. టెట్ ముగిశాక14 వేల ఉపాధ్యాయ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పలుమార్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం పేర్కొన్న ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి, నోటిఫికేషన్​ విడుదల, పరీక్ష, ఫలితాల ప్రకటన పూర్తయ్యేసరికి ఈ ఏడాది గడుస్తుంది. టీచర్లు లేకుండానే విద్యార్థులు పైతరగతులకు ప్రమోట్​కావాల్సి వస్తుంది. టీచర్ల ఖాళీల సమస్యను తీర్చడానికి గతంలో తీసుకున్న విద్యావలంటీర్లను కూడా ప్రభుత్వం రెన్యువల్ ​చేయలేదు. దీంతో అటు టీచర్లు, ఇటు విద్యావలంటీర్లు లేక సర్కారు బడుల్లో చదువులు ఆగమయ్యే పరిస్థితి నెలకొంది.


ఐదేండ్ల తర్వాత భర్తీ.. అయినా ఆలస్యం


రాష్ట్రంలో చివరి సారిగా 2017 జులై 23న ప్రభుత్వం టెట్ నిర్వహించింది. అప్పట్లో సుప్రీం కోర్టు తీర్పుతో 2017 అక్టోబర్ 22 న 8,792  టీచర్​పోస్టుల ఖాళీలకు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దాదాపు మళ్లీ ఐదేండ్లకు గత నెల 12 న టెట్ నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు 4 లక్షల మంది హాజరయ్యారు. గత నెల 12తో కలిపి ఇప్పటివరకు అన్ని టెట్ లలో పేపర్1లో ఒక లక్షా 35 వేల మంది, టెట్ పేపర్ 2లో రెండు లక్షల 50 వేల మంది అర్హత పొందారు. దాదాపు 4  లక్షల మంది బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు టెట్​లో అర్హత పొంది టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇతర శాఖల ఖాళీల భర్తీ కోసం ప్రకటనలు ఇస్తున్న ప్రభుత్వం సత్వరం అవసరం ఉన్న టీచర్లను రిక్రూట్​చేయడంలో ఆలస్యం చేస్తోంది. ఇటీవల గురుకుల పాఠశాలలో 9 వేల ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా.. ఆ పోస్టులకు టెట్​తో సంబంధం లేదు. 

ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కువ


ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వాలు టీచర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో నింపాయి. వైఎస్ఆర్​హయాంలో మెగా డీఎస్సీలు, చివరగా కిరణ్​కుమార్​రెడ్డి పాలనలోనూ టీచర్ల రిక్రూట్​మెంట్​పూర్తి స్థాయిలో జరిగింది. కానీ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఒకే ఒక్క డీఎస్సీ(టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అది కూడా కేవలం 8,792 ఖాళీలకు మాత్రమే. నోటిఫికేషన్ జారీ చేసి కూడా 3 సంవత్సరాలు సాగదీసి పోస్టింగ్స్ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల వరకు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం బదిలీలతోపాటు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఖాళీలను గుర్తించాలి. ఇంతకు ముందు పేర్కొన్న 14 వేల పోస్టులతోపాటు అదనంగా ఏర్పడే మరో 6 నుంచి 8 వేల పోస్టులను కూడా ఒకేసారి రిక్రూట్​చేయాలి.


పిల్లల పాఠాలపై ఎఫెక్ట్


టెట్​పూర్తయి.. ఫలితాలు కూడా వచ్చినా ప్రభుత్వం టీచర్ల రిక్రూట్​మెంట్​ను వేగవంతం చేయడం లేదు. రిక్రూట్​మెంట్​మరింత ఆలస్యమైతే ఆ ప్రభావం పిల్లల చదువులపై పడే ఆస్కారం ఉంది. ఇప్పటికే సర్కారు బడుల్లో టీచర్లు లేక.. పిల్లలకు సరైన విద్య అందడం లేదు. వేసవి సెలవుల్లో పూర్తి కావాల్సిన టీచర్ల భర్తీ, బదిలీలు, ప్రమోషన్లు.. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా ముందుకు కదలడం లేదు. రిక్రూట్​మెంట్​ప్రక్రియను వేగవంతం చేస్తేనే.. కొత్త టీచర్లు బడుల్లో చేరి పిల్లలకు పాఠాలు చెప్పే వెసులుబాటు ఉంటుంది. ఇతర నోటిఫికేషన్లు ఇస్తున్న ప్రభుత్వం.. పిల్లలకు ఇప్పటికిప్పుడు చాలా అవసరం ఉన్న టీచర్ల 
పోస్టులను నింపడంలో జాప్యం చేయొద్దు. 


- రావుల రామ్మోహన్ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు, 
డీఎడ్, బీఎడ్ 
అభ్యర్థుల సంఘం