IND vs AUS: పాండ్య అనుకుంటే నితీష్‌కు అదే గాయం.. మూడో వన్డే నుంచి ఔట్.. టీ20 సిరీస్‌కు డౌట్!

IND vs AUS: పాండ్య అనుకుంటే నితీష్‌కు అదే గాయం.. మూడో వన్డే నుంచి ఔట్.. టీ20 సిరీస్‌కు డౌట్!

సిడ్నీ వేదికగా శనివారం (అక్టోబర్ 25) ఆస్ట్రేలియాతో ప్రారంభమైన మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. తొలి రెండు వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపించని ఫస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ స్థానంలో ప్రసిద్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ కు స్థానం దక్కింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేకు దూరం అయ్యాడు. అడిలైడ్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో నితీష్ ఎడమ క్వాడ్రిసెప్స్‌కు గాయమైంది. తొడ కండరాలతో ఇబ్బంది పడుతూ కనిపించాడు.

నితీష్ గాయాన్ని బీసీసీఐ తమ అధికారిక ఎక్స్ ద్వారా తెలిపింది. "అడిలైడ్ వన్డేలో నితీష్ కు గాయమైంది. మూడో వన్డేకు నితీష్ అందుబాటులో ఉండడం లేదు. ఆల్ రౌండర్‌ను వైద్య బృందం పర్యవేక్షిస్తుంది". అని బీసీసీఐ తెలియజేసింది. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన నితీష్ రెండో వన్డేలో నిరాశపరిచాడు. హార్దిక్ పాండ్య స్థానంలో జట్టులో స్థానం దక్కించుకున్నా ఆ రేంజ్ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఆశ్చర్యకరంగా పాండ్య, నితీష్ ఇద్దరూ కూడా తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్నారు. రెండు మ్యాచ్ ల్లో కలిపి కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 

గాయం కారణంగా నితీష్ ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మెగా సిరీస్ కు ఇండియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ లేకుండానే ఆసీస్ పై ఆడనుంది. ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్ లపై ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ జట్టులో ఉంటే బ్యాటింగ్, బౌలింగ్ లో సమతుల్యత వస్తుంది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో గాయపడిన నితీష్.. ఇటీవలే జరిగిన వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కు అందుబాటులో వచ్చాడు. దురదృష్టవశాత్తు  ఆస్ట్రేలియా సిరీస్ లో మళ్ళీ గాయపడడం విచారకరం. 

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలకు ఇండియా జట్టు: 

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ ( వికెట్ కీపర్ ), వాషింగ్టన్ సుందర్