నర్సాపూర్, వెలుగు: ఎలుకలు కరవడంతో ఎనిమిది మంది స్టూడెంట్లకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామ శివారులోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల స్కూల్‌లో గురువారం రాత్రి జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి స్టూడెంట్లు నిద్రిస్తున్న టైంలో ఎలుకలు కరవడంతో నిఖిత, జ్యోతి, ఉష, గీతాంజలి, సంధ్య, అశ్వితతో పాటు మరో ఇద్దరు స్టూడెంట్లకు గాయాలు అయ్యాయి.
విషయాన్ని హాస్టల్ నిర్వాహకులకు చెప్పడంతో నర్సాపూర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందించారు. విషయం తెలుసుకున్న స్టూడెంట్ల తల్లిదండ్రులు హాస్టల్ నిర్వాహకులపై మండిపడ్డారు. హాస్టల్‌లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్టూడెంట్ల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ లలితాదేవి మాట్లాడుతూ ఎలుకల కారణంగా గాయపడిన స్టూడెంట్లకు ట్రీట్‌మెంట్ చేయించామని చెప్పారు. హాస్టల్ అటవీ ప్రాంతంలో ఉండడంతో ఎలుకలు, పాములు వస్తున్నాయన్నారు.
