ఈ ఎర్రచందనం స్మగ్లర్లు పుష్పను మించిపోయారు.. వీళ్ల ప్లాన్కు అవాక్కవ్వాల్సిందే

ఈ  ఎర్రచందనం స్మగ్లర్లు పుష్పను మించిపోయారు.. వీళ్ల ప్లాన్కు అవాక్కవ్వాల్సిందే

ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మూడు కేసుల్లో 32 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు స్మగ్లర్లiను అరెస్టు చేశారు. అయితే తమిళనాడుకు చెందిన కార్లకు ఏపీ నెంబర్లు వేసుకుని ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్సు పోలీసులు వెల్లడించారు.  

మూడు టీమ్ లతో 2023 ఆగస్టు 09 బుధవారం నుంచి ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి, చిరంజీవులు, ఆర్ఎస్ఐలు పి.నరేష్, లింగాధర్ ..అన్నమయ్య జిల్లా సానిపాయ నుంచి కూంబింగ్ చేపట్టారు. రాయవరం సెక్షన్ లోని అటవీ ప్రాంతంలో శేషాచలం ఎక్స్ టెన్షన్ రిజర్వు ఫారెస్టులో  ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తుండగా పట్టుకున్నామని టాస్క్ ఫోర్సు పోలీసులు తెలిపారు. వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలు, ఒక కారు, ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో భాగంగా తమిళనాడు తిరువన్నమలై జిల్లా జమునా మత్తూరు తాలూకాకు చెందిన టీ.వెంకటేశన్ (26), హరి (46), చిత్తూరు జిల్లా కోట మండలానికి చెందిన కేసీ విజయకుమార్(33)లను అరెస్టు చేశారు.

 మరో కేసులో  తమిళనాడుకు చెందిన పొన్నుస్వామి శరత్ (19), చిన్నరాజి పచ్చయప్పన్ (20), నడిపయ్యన్ మణి (50)లను అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. వీరి నుంచి 22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దాదాపు టన్నుకు పైగా ఉన్న ఎర్రచందనం దుంగల విలువ రూ.50లక్షలకు పైగా ఉంటుందని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఈ  ఆపరేషన్లలో పాల్గొన్న సిబ్బందికి డీఐజీ సెంథిల్ కుమార్ రివార్డులు ప్రకటించారు.