సాగునీటి విడుదలకు సదర్ మాట్ సిద్ధం!..జనవరి 16న ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

సాగునీటి విడుదలకు సదర్ మాట్ సిద్ధం!..జనవరి 16న  ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • గత సర్కారు నిర్లక్ష్యంతో  పదేండ్ల నుంచి నిలిచిన పనులు
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే కంప్లీట్ 
  • వచ్చే యాసంగి పంటలకు సాగు నీటి విడుదల
  • ఏర్పాట్లలో నిమగ్నమైన ఇరిగేషన్ అధికారులు 
  • కల నెరవేరడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం 

నిర్మల్, వెలుగు: ఎట్టకేలకు సదర్ మాట్​ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల కల నెరవేరింది. గత బీఆర్ఎస్ పాలకులు ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేస్తే..  ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంది. తెలంగాణ వచ్చాక  రైతులు ఒత్తిడి మేరకు సదర్ మాట్​బ్యారేజీని నిర్మిస్తామని గత బీఆర్ఎస్ పాలకులు హామీ ఇచ్చి మర్చిపోయారు. 

సదర్ మాట్​​కు మధ్యలోనే నిధులను నిలిపివేయడంతో పనులు ఆగాయి. కాంగ్రెస్ వచ్చి వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. సదర్ మాట్​పనులకు రూ. 14 కోట్లను మంజూరు చేసింది. దీంతో  బ్యారేజీకి 55 గేట్ల నిర్మాణాలు, ఎలక్ట్రిఫికేషన్, గ్రీసింగ్ పనులను పూర్తి చేశారు. 

గోదావరి నీటిని బ్యారేజీలో నిల్వ చేసేందుకు టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అనుమతులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్ డీఎస్ఏ), అధికారులు జారీ చేశారు.  వచ్చే యాసంగికి ప్రాజెక్ట్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.  

రెండు జిల్లాల్లో 18  వేల ఎకరాలకు సాగునీరు

నిర్మల్ జిల్లా పొన్కల్ వద్ద గోదావరి నది నుంచి  నీటిని తీసుకుని 18 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో సదర్ మాట్​ ప్రాజెక్ట్ ను నిర్మించారు.  నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 18,120 ఎకరాలకు సాగునీటిని అందించాలనేది లక్ష్యం.  నిర్మల్ జిల్లాలో 13, 120 ఎకరాలు,  జగిత్యాల జిల్లాలో 5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.  రెండు జిల్లాలకు సరిహద్దులకు ప్రాజెక్ట్ ఆనుకుని ఉంది. 

భూములు కోల్పోయిన రెండు జిల్లాల రైతులకు పరిహారం కూడా అందించారు. బ్యారేజీ అంచనా వ్యయం రూ. 676 కోట్లు కాగా,  మొత్తం1,170 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇందుకు రూ. 120 కోట్లు భూములు కోల్పోయిన నిర్వాసితులకు అందించారు. ప్రాజెక్టు వ్యయంతో సంబంధం లేకుండా ఎలక్ట్రిఫికేషన్  కోసం మరో  రూ.14 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.  

వచ్చే యాసంగి పంటలకు సాగు నీరు 

సదర్ మాట్​ ప్రాజెక్ట్ కు నీటి కేటాయింపులకు ఎన్డీఎస్ఏ అనుమతులు కూడా రావడంతో సాగునీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. ఈనెల 16న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించి  55 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సీతక్క  సదర్ మాట్​ ​పనులపై సమీక్షించారు. హామీ మేరకు బ్యారేజీ పనులను పూర్తి చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని రెండేళ్లలోనే బ్యారేజీ ని పూర్తి చేయడంతో పాటు ఆయకట్టుకు త్వరలోనే సాగునీరు అందనుండగా రైతులు ఆనందంలో మునిగిపోయారు.