రెడ్డి కార్పొరేషన్ కోసం రెడ్డి జాగృతి డిమాండ్

రెడ్డి కార్పొరేషన్  కోసం రెడ్డి జాగృతి డిమాండ్

హైదరాబాద్: రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గ ప్రజల కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవ రెడ్డి, అధ్యక్షుడు  అడ్ల ఉప్పల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఉప్పల్ లోని మేకల గార్డెన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. లేకుంటే ప్రభుత్వం మాట తప్పినందుకు నిరసనగా మునుగోడు ఉప ఎన్నికలో రెడ్డి జాగృతి తరఫున పోటీ చేస్తామని చెప్పారు.

అలాగే రెడ్డి విద్యార్థులకు EWS రిజర్వేషన్లు అమలు చేయాలని రెడ్డి జాగృతి అధ్యక్షుడు అడ్ల ఉప్పల్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో వేల మంది విద్యార్థులతో మౌన ప్రదర్శన చేస్తామని హెచ్చరించారు. రెడ్డి కార్పొరేషన్, EWS రిజర్వేషన్లు అమలు చేసే వరకు ఉద్యమం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి సభ్యులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.