సాధారణంగా ఏదైనా దేశం అప్పులు చేస్తే.. వడ్డీతో సహా డబ్బు రూపంలో చెల్లిస్తాయి. కానీ పాకిస్థాన్ రూటే వేరు. తన దగ్గర ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు అట్టడుగుకు పడిపోవడంతో క్యాష్ పేమెంట్స్ బదులుగా.. యుద్ధ విమానాలు ఇస్తామని, 'సైనిక సంస్థల' వాటాలను రాసిస్తామని చెబుతోంది. దీనిని ఆర్థిక నిపుణులు ఫైనాన్షియల్ అల్కెమీ అంటే ఆర్థిక మాయాజాలం అని పిలుస్తున్నారు.
డబ్బుల్లేవ్ యుద్ధ విమానాలు తీస్కోండి:
సౌదీ అరేబియా నుంచి తీసుకున్న సుమారు 2 బిలియన్ డాలర్ల అప్పును తీర్చడానికి పాక్ ఒక వింత ప్రతిపాదన పెట్టింది. తమ దగ్గర ఉన్న JF-17 థండర్ యుద్ధ విమానాలను సౌదీకి ఇచ్చి.. ఆ మేరకు అప్పును మాఫీ చేసుకోవాలని చూస్తోంది. చైనాతో కలిసి తయారు చేసిన ఈ విమానాలను విక్రయించడం ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదుర్చుకోవాలని పాక్ ఆశపడుతోంది. అంటే నగదు చెల్లింపులకు బదులుగా ఆయుధాల ఎగుమతిని ఒక ఆర్థిక వ్యూహంగా మార్చుకుంది.
ఆర్మీ కంపెనీల వాటాలు విదేశాల పరం..
కేవలం విమానాలే కాదు.. ఏకంగా పాక్ సైన్యానికి చెందిన వ్యాపార సామ్రాజ్యంలో వాటాలను కూడా అమ్మకానికి పెట్టింది దాయాది దేశం. పాక్ ఆర్మీ నడిపే ఫౌజీ ఫౌండేషన్ భారీ వ్యాపార సంస్థలోని 1 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఇచ్చేందుకు పాక్ సిద్ధమైంది. మార్చి 31, 2026 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పులు తీర్చలేక దేశపు ఆస్తులను, సైనిక సంస్థలను ఇలా విదేశీయులకు కట్టబెట్టడం ఆ దేశ సార్వభౌమాధికారానికే ప్రమాదకరమనే వాదనలు వినిపిస్తున్నాయి.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఇటీవలే ఒక ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేశారు. తమ ఆయుధ పరిశ్రమ లాభాల్లోకి వస్తే తమకు ఇక 'అంతర్జాతీయ ద్రవ్యనిధి' సాయం అక్కర్లేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్, లిబియా వంటి దేశాలకు కూడా యుద్ధ విమానాలను అమ్మేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. అయితే దేశంలోని సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. కేవలం ఆయుధాల అమ్మకం ద్వారా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కిస్తామని అనుకోవడం పగటి కల మాత్రమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
దివాళా అంచున పాక్..
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 410 బిలియన్ డాలర్లు కాగా.. దాని విదేశీ అప్పు ఏకంగా 92 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రధానంగా ఉత్పాదకత లేకపోవటం, పన్ను ఆదాయం లేకపోవటంతో పాక్ ఇబ్బంది పడుతోంది. ఉన్న నాలుగైదు విదేశీ సంస్థలు కూడా అక్కడి నుంచి వ్యాపారాలు అమ్ముకుని వెళ్లిపోవటంతో రోజురోజుకూ పాక్ పరిస్థితి దిగజారుతోంది. ప్రస్తుతం పాక్ కేవలం అప్పులు రోల్ ఓవర్ చేయించుకోవడం కోసమే తంటాలు పడుతోంది.
నగదుకు బదులుగా యుద్ధ విమానాలు, ఆర్మీ షేర్లు ఇవ్వడం వినడానికి క్రేజీగా ఉన్నా.. ఇది పాక్ ఆర్థిక దుస్థితిని బయటపెట్టింది. ఇలాంటి వింత డీల్స్ తాత్కాలికంగా ఊరటనివ్వవచ్చు కానీ, పాక్ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దలేవని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
