హెల్త్​ ఇన్సూరెన్స్​పై  జీఎస్టీ వద్దు

హెల్త్​ ఇన్సూరెన్స్​పై  జీఎస్టీ వద్దు
  • సీనియర్​ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి
  • మిగతా వారికి 18 నుంచి 5 శాతానికి తగ్గించాలి
  • 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్​లో డిప్యూటీ సీఎం భట్టి 
  • ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా అందించాలని సూచన

న్యూఢిల్లీ, వెలుగు : సీనియర్‌‌  సిటిజన్లకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్‌‌టీని తొలగించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సూచించారు. మిగతా అన్ని వయసుల వారికి హెల్త్  ఇన్సూరెన్స్  ప్రీమియంలపై జీఎస్‌‌టీని 18 శాతం నుంచి 5 శాతం పరిధిలోకి తేవాలని కోరారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో 54వ జీఎస్టీ కౌన్సిల్  మీటింగ్  జరిగింది. ఈ మీటింగ్ కు తెలంగాణ నుంచి ఆర్థిక మంత్రి భట్టి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిల్  మీటింగ్​లో భట్టి పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ఆరోగ్య బీమా ద్వారా ప్రజలందరూ తక్కువ ఖర్చుతో పొందేలా చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.

మధ్యతరగతి, కింది తరగతి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ లభించాలంటే బీమా ప్రీమియంలపై పన్ను మినహాయించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. గ్రూప్‌‌  బీమా, కుటుంబ బీమా స్కీంలపై పన్నులు విధించే మంత్రుల కమిటీలో తెలంగాణ ప్రభుత్వం తరపున తమకు అవకాశం కల్పించాలన్నారు. జీఎస్‌‌టీకి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌‌ను కూడా చేర్చాలని కోరారు. రాష్ట్రాల ఆర్థిక వనరులను బలోపేతం చేసేందుకే పరిహార సెస్‌‌ను విధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో కూడా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Also Read :- బోర్లను మింగిన వాగులు

అడ్‌‌హాక్‌‌గా గతంలో కేటాయించిన జీఎస్‌‌టీ మొత్తంలో అదనపు మొత్తాన్ని రికవరీ చేసే విషయం పరిశీలించేందుకు ఆఫీసర్స్ కమిటీ (సీఓఓ) ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను ప్రోత్సహించేలా ఆయా సంస్థలకు ఇచ్చే పరిశోధన గ్రాంట్లపైనా జీఎస్‌‌టీని తొలగించాలని భట్టి కోరారు. ఈ మీటింగ్ అనంతరం భట్టి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్  బయలుదేరారు.