
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే కమర్షియల్ ఎల్‌పీజీ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గురువారం తగ్గించాయి. 19 కిలోల సిలిండర్ రేటుకు రూ.14.50 కోత పెట్టాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ ఎల్‌పీజీ ధర రూ. 1,747.50కి దిగొచ్చింది. ప్రతీ నెల ఒకటిన జరిపే రివ్యూలో గతసారి సిలిండర్‌పై రూ.41 తగ్గించారు. ఇండ్లలో ఉపయోగించే వంట గ్యాస్ ధర 14.2 కిలోల సిలిండర్‌కు రూ.853 వద్ద కొనసాగుతోంది.
కాగా, ఏప్రిల్ ప్రారంభంలో వంటగ్యాస్ ధర సిలిండర్‌పై రూ.50 పెరిగిన విషయం తెలిసిందే. మరోవైపు విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్) ధరను కూడా కంపెనీలు 4.4 శాతం తగ్గించాయి. ఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర కిలోలీటర్‌కు రూ.3,954.38, అంటే 4.4 శాతం తగ్గి రూ.85,486.80కి చేరింది. ఏప్రిల్ 1న కూడా 6.15 శాతం (కిలోకి రూ.5,870.54) తగ్గిన విషయం తెలిసిందే.