సింగూరుకు తగ్గిన వరద ప్రవాహం

 సింగూరుకు తగ్గిన వరద ప్రవాహం

సంగారెడ్డి జిల్లా: భారీ వర్షాలతో అతలాకుతలం అయిన మెతుకుసీమ తేరుకుంటోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గిపోయింది. గంటల వ్యవధిలోనే సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గిపోవడంతో ప్రాజెక్టు మూడు గేట్లు మూసివేశారు. శనివారం భారీ వరద పోటెత్తడంతో ఎత్తిన 9, 10, 11 నంబర్ల మూడు గేట్లు గేట్లు మూతపడ్డాయి. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు 11 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 
వరద ప్రవాహం క్రమంగా తగ్గిపోతుండడంతో గేట్లు మూసేసిన అధికారులు జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ 2628 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సిగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం..27.258 టీఎంసీలు ఉంది. సింగూరు ప్రాజెక్టుకు వరద పోటు తగ్గిపోవడంతో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 
వారం రోజులకుపైగా ఏకధాటిగా కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, సంగారెడ్డి, అమీన్ పూర్, పటాన్ చెరు, నారాయణఖేడ్, సిర్గాపూర్ నాగలిగిద్ద, కల్హేర్, కాంగ్టి, న్యాల్కల్ మండలాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. 
గతంలో ఎన్నడూ లేనంతగా వాగులు, వంకలు ఉప్పొంగడంతో మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో రెండు లో లెవల్ బ్రిడ్జీలు మునిగిపోయాయి. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని పలుచోట్ల రోడ్లు తెగిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్ డాక్టర్ శరత్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలిచ్చారు.