
- టెట్‌లో మార్కుల లొల్లి
- ఫైనల్ కీతో పోలిస్తే రిజల్ట్‌లో తగ్గిన మార్కులు
- ఫలితాలపై అభ్యర్థుల్లో ఆందోళన
- మార్కులు తక్కువ వచ్చాయంటూ టెట్ ఆఫీస్‌కు క్యూ
- ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్లు
హైదరాబాద్, వెలుగు: దాదాపు ఐదేండ్ల తర్వాత రాష్ట్రంలో జూన్12న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించారు. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ)లో 20% టెట్ మార్కులకు వెయిటేజీ ఉండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్1కు 3,18,444 మంది, పేపర్ 2కు 2,50,897 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. అదే నెల15న ప్రైమరీ ‘కీ’ని అధికారులు రిలీజ్ చేసి అభ్యంతరాలను తీసుకున్నారు. పేపర్1లో 7,930 , పేపర్2లో 4,663 ఆబ్జెక్షన్స్ వచ్చాయి. వీటన్నింటినీ సరిచేస్తూ అదే నెల 27న ఫలితాలు రిలీజ్ చేయాల్సి ఉన్నా వాయిదా వేశారు. ఫైనల్ ‘కీ’ని 29న విడుదల చేశారు. ఆ తర్వాత రెండ్రోజులకు జులై 1న ఫలితాలు విడుదల చేశారు. అయితే పేపర్ 1లో 1,04,078 (32.68%) మంది, పేపర్ 2లో 1,24,535 (49.64%) మంది మాత్రమే అర్హత సాధించారు. నిజానికి టెట్ రాసిన తర్వాత చాలామంది ఈజీగానే వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రిజల్ట్ చూస్తే అది తారుమారైంది. చాలా మంది క్వాలిఫై కాలేదు. క్వాలిఫై అయిన అభ్యర్థులూ తక్కువ మార్కులు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీకి నిత్యం అభ్యర్థులు వచ్చిపోతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని అక్కడి సిబ్బందికి చెప్తున్నారు. వెరిఫై చేయాలని, లేదంటే ఓఎంఆర్ షీట్లను బయటకు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే టెట్ ఓఎంఆర్ షీట్లను ఇచ్చేందుకు అధికారులు వెనకాముందు ఆడుతున్నారు.
ఫైనల్ ‘కీ’లో మార్పులు ఇలా..
పేపర్ 1లో 4 ప్రశ్నలకు (సమాధానం ఇచ్చిన వారందరికీ) మార్కులు వేయగా, 4 ప్రశ్నలకు రెండేసి సమాధానాలు (రెండు ఆప్షన్లలో ఏది పెట్టినా మార్క్) ఇచ్చారు.
పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 4 ప్రశ్నలకు మార్కులు ఇవ్వగా, ఒకదానికి రెండు ఆన్సర్లు ఇచ్చారు. సోషల్‌లో 4 ప్రశ్నలకు మార్కులు యాడ్ చేయగా, ఒకదానికి రెండు ఆన్సర్స్ ఇచ్చారు.
పేపర్ 1లో సీ– కోడ్ క్వశ్చన్ పేపర్‌లో 28వ ప్రశ్నలో ప్రైమరీ కీలో 3వ ఆన్సర్ అని, పైనల్ కీలో మాత్రం 1వ ఆన్సర్ అని ఇచ్చారు. అబ్జెక్షన్స్ వస్తే ఫైనల్ రిజల్ట్‌లో 1 లేదా3 కరెక్ట్ అని ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రైమరీ కీలో ఆన్సర్‌ను మార్చేశారు.
‘‘పేపర్‑1లో ప్రైమరీ ‘కీ’ చూస్తే 104 మార్కులొచ్చాయి. ఫైనల్ ‘కీ’ చూస్తే 105 వచ్చాయి. కానీ రిజల్ట్‌లో వచ్చింది 98 మాత్రమే. పేపర్‑2లోనూ ఇదే సమస్య. ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో పెట్టాలి’’
‑ మణి అనే అభ్యర్థి డిమాండ్..
“కీ ప్రకారం పేపర్‑1లో 80 మార్కులు రావాలి.. కానీ 73 మాత్రమే వచ్చాయి. పేపర్‑2లోనూ 80 రావాలి. కానీ 74 వచ్చాయి. ఎందుకు ఇంత తేడా?”
‑ రేణుకారెడ్డి అనే అభ్యర్థి ఆవేదన..
ఈ ఇద్దరు అభ్యర్థులే కాదు.. టెట్ రాసిన చాలా మంది పరిస్థితి ఇట్లనే ఉంది. ఫైనల్ ‘కీ’ చూసిన తర్వాత క్వాలిఫై అవుతామని, ఎక్కువ మార్కులు వస్తాయని సంతోషపడ్డ అభ్యర్థులకు ఫలితాలు షాకిచ్చాయి. ‘కీ’లో చూసిన మార్కులకు.. రిజల్ట్‌లో వచ్చిన మార్కులకు పొంతన లేదు. కొందరికి ఐదారు మార్కులు తక్కువగా వస్తే.. మరికొందరికి ఏకంగా 20 మార్కుల దాకా తగ్గాయి. మంచి మార్కులు వస్తాయని భావించిన వారు కనీసం క్వాలిఫై కూడా కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టెట్ ఆఫీసుకు క్యూ కడుతున్నారు. అధికారికంగా పెట్టిన ఫైనల్ ‘కీ’ ప్రకారం కూడా మార్కులు రాలేదని, ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.