ఆర్టీసీ డిపోల తగ్గింపు.. గ్రేటర్‌లో 12 డిపోలు విలీనం

ఆర్టీసీ డిపోల తగ్గింపు.. గ్రేటర్‌లో 12 డిపోలు విలీనం
  • దగ్గరదగ్గరున్న రెండు డిపోలు ఒకటిగా విలీనం
  • ఆ స్థలాలు, ఆస్తులు ప్రైవేట్కు లీజుకు ఇచ్చే యోచన
  • మొదటగా గ్రేటర్లోని 12 డిపోలు విలీనం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలోని బస్ డిపోల సంఖ్యను కుదించనున్నారు. ఈ మేరకు సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దగ్గర దగ్గర ఉన్న రెండు డిపోలను కలిపి ఒకటిగా విలీనం చేయనున్నారు. మొదటగా గ్రేటర్ హైదరాబాద్లోని  డిపోలను తగ్గించనున్నట్లు సమాచారం.
బస్సులు తగ్గడంతో ఖాళీగా డిపోలు
రాష్ట్రవ్యాప్తంగా 97 బస్ డిపోలున్నాయి. 2019లో సమ్మె టైంలో ఆర్టీసీలో 8,360 బస్సులుండగా, ఇప్పుడు 6,579కి తగ్గాయి. సమ్మె తర్వాత సిటీలో వెయ్యి బస్సులు పక్కనపెట్టారు. దీంతో అనేక మందికి డ్యూటీలు లేకపోవడంతో కార్గో, పార్సిల్ సర్వీసులు, పెట్రోల్ పంపులు, బస్పాస్ కౌంటర్లకు వాడుకున్నారు. అద్దె బస్సులు పెరుగుతుండటంతో ఆర్టీసీ బస్సులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో కొన్ని డిపోలు ఖాళీగా ఉంటున్నాయి.ఈ నేపథ్యంలో మొదట హైదరాబాద్లోని డిపోలను మెర్జ్ చేయనున్నారు. దగ్గరదగ్గరున్న వాటిని ఒకే డిపోలో విలీనం చేయనున్నారు. బస్సులన్నీ ఒకే డిపోలో పెట్టనున్నారు. సిటీ పరిధిలో29 డిపోలు ఉన్నాయి. ఇందులో సుమారు 12 డిపోలు ఖాళీ చేయనున్నట్లు తెలిసింది. కాగా రెండు రోజుల క్రితం పికెట్ డిపోలను దాదాపు ఖాళీ చేశారు. ఇందులోని బస్సులను కంటోన్మెంట్, మియాపూర్, యాదగిరిగుట్టకు పంపారు.
ముందుగా ఏయే డిపోలంటే
ముషీరాబాద్–1,2, హయత్నగర్–1,2, రాణిగంజ్–1,2, మియాపూర్1,2, హైదరాబాద్–1,2,3 డిపోలు పక్కపక్కనే ఉన్నాయి. ఒక్కో డిపోగా మెర్జ్ చేసే చాన్స్ ఉంది. మరికొన్నింటిని విలీనం చేయనున్నారు. హైదరాబాద్లోని చాలా డిపోలు కమర్షియల్ ప్లేసుల్లో నాలుగైదు ఎకరాల్లో ఉన్నాయి. కుదింపు తర్వాత మిగలనున్న 12 డిపోలను లీజుకు ఇవ్వనున్నారు.
వారిని ఏం చేస్తరో?
బస్సులతోపాటు డిపోల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి ఉంది. కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర కింది స్థాయి ఉద్యోగుల అడ్జస్ట్మెంట్ ఇబ్బంది ఉండదు. కుదించిన డిపోలు దగ్గరలోనే ఉండనుండటంతో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. లేకుంటే ఏ డిపో కావాలో ఆప్షన్ ఎంచుకోవాలని కోరనున్నారు. అయితే ఏడీసీ, సీఐ, సూపర్వైజర్, అసిస్టెంట్ డిపో మేనేజర్, డిపో మేనేజర్లను ఏం చేస్తారనేది క్లారిటీ లేదు.