బండరావిరాలలో ప్రజాభిప్రాయ సేకరణ

బండరావిరాలలో ప్రజాభిప్రాయ సేకరణ

ఎల్బీ నగర్,వెలుగు: అబ్దుల్లాపూర్​మెట్​ మండలం బండరావిరాల పరిధిలో మైనింగ్ వద్దంటూ నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టర్​ అమోయ్​ కుమార్​ మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. మైనింగ్ జోన్​లో భూములు కోల్పోయిన రైతులు, మైనింగ్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. కొంతమంది లీడర్లు, క్రషర్స్ యాజమాన్యాలు పే కూలీలను తీసుకువచ్చి బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళనకు దిగారు. హాని కలిగించే మైనింగ్ను తొలగించాలని డిమాండ్​ చేశారు. అయితే తమ అభిప్రాయం లేకుండా క్రషర్ యజమానులకు అనుకూలమైన వారితో పాటు, ఇతర ప్రాంతాలవారి అభిప్రాయ సేకరణ చేశారని వారు ఆవేదన చెందారు. మైనింగ్​ జోన్​లో భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం కోసం నేటికీ పోరాడుతూనే ఉన్నారని, నాయకులు హామీ ఇచ్చినా నేటికీ న్యాయం చేయడం లేదని తెలిపారు. మైనింగ్ జోన్ ప్రాంతంలో సొంత పొలాల్లోకి వెళ్లాలంటే భయంగా ఉంటుందని, బ్లాస్టింగ్ వల్ల ఎప్పుడు ఏ రాయి వచ్చి మీద పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ తో చిన్నపిల్లలు అవిటివారిగా తయారవుతున్నారని , అనేక మంది ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతూ చనిపోయిన రోజులు ఉన్నాయని బాధితులు పేర్కొన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటచారి, తహసీల్దార్​తదితరులు పాల్గొన్నారు.